
- మోదీ మూడు రోజుల టూర్లో గ్రేటర్, నార్త్‌కు ప్రాధాన్యం
- రాష్ట్రంలో 20 సీట్లలో విజయానికి పార్టీ ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఆశలన్ని ఉత్తర తెలంగాణపైనే పెట్టుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, తర్వాత ఉత్తర తెలంగాణలోనే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో కమలం పార్టీ ఉంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల టూర్ కూడా ఈ ప్రాంతాల్లోనే ఖరారైంది. దక్షిణ తెలంగాణపై బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. అందుకే గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలతో పాటు ఉత్తర తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును నిలుపుకునే ప్రయత్నాల్లో ఉంది.
ఇటీవల జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 మంది కార్పొరేటర్లను గెలుచుకోవడం.. ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో సానుకూల అంశంగా మారనుంది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. అవి ఒకటి గ్రేటర్ పరిధిలో ఉండగా, మిగితా మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనివి. అందుకే బీజేపీ ఈ ప్రాంతాలపైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు రాజకీయంగా సవాల్ విసరాలని భావిస్తున్నది.
ముగ్గురు ఎంపీలు అక్కడి నుంచేబీజేపీకి ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉండగా అందులో కిషన్ రెడ్డి గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి, ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలపైనే హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక్కడే బీజేపీ కనీసం 20 సీట్లను గెలుచుకొని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా.. నేనా అనే రీతిలో పోరు కొనసాగుతుండడంతో ఒకవేళ హంగ్ కు ఏమాత్రం అవకాశం ఉన్నా.. బీజేపీ కీలకం కావాలని ఆశిస్తుంది. తెలంగాణలో కనీసం 20 సీట్లు గెలవండి.. ప్రభుత్వ ఏర్పాటులో మనమే కీలకం అవుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలతో అనడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
- హైదరాబాద్‌లో మోదీ రోడ్ షో
స్వయంగా ప్రధాని మోదీ ఈ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. అందుకే మోదీ ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభ, అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రానికి రానున్న మోదీ.. ఈ నెల 25 న కరీంనగర్, 26 న నిర్మల్, 27 న హైదరాబాద్ లో రోడ్ షో కు అటెండ్ కానున్నారు. ఎన్నికల ప్రచారానికి ముగింపు సమయంలో మోదీ రాష్ట్ర టూర్ ఖరారు చేసుకోవడం బీజేపీకి కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.