ఎగ్జిట్ పోల్స్ :గుజరాత్లో మళ్లీ బీజేపీ హవా

ఎగ్జిట్ పోల్స్ :గుజరాత్లో మళ్లీ బీజేపీ హవా

గుజరాత్ లో మళ్లీ కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాని మోడీ మేనియా మళ్లీ పనిచేసిందని చెబుతున్నాయి. ప్రజలు అభివృద్ధి మంత్రానికే ఓటు వేశారని తెలిపాయి. ట్రయాంగిల్ పోటీలో బీజేపీ వైపే ప్రజలు మళ్లీ మొగ్గుచూపినట్టు కనిపిస్తోంది. హోరాహోరీగా సాగిన పోరులో కమలం పార్టీనే మళ్లీ పైచేయి సాధించినట్టు తెలుస్తోంది. అధికారం కోసం కాంగ్రెస్, ఆప్ పార్టీలు వీరోచితంగా పోరాడిన ప్రజలు ఈ రెండు పార్టీలను విశ్వసించలేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గుజరాత్‌లో  వరుసగా ఏడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

News X- Jan Ki Baat

గుజరాత్ లో బీజేపీదే మళ్లీ అధికారమని న్యూస్ ఎక్స్  జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. మొత్తం 182 స్థానాలకు గానూ.. 117 నుంచి 140  స్థానాల్లో విజయఢంకా మోగించనున్నట్టు తెలుస్తోంది. ఇక మిగతా పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్ 34 నుంచి 51 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 6 నుంచి 13 సీట్లు..ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. 

Republic TV P-MARQ

రిపబ్లిక్ టీవీ పీ మార్క్ ఎగ్జిట్ పోల్ గమనిస్తే  గుజరాత్ లో బీజేపీ 128 నుంచి 148 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 30 నుంచి 42 సీట్లను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ఆప్  2 నుంచి 10 స్థానాలు గెల్చుకునే ఛాన్స్ ఉంది. 

Times Now-ETG

టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిల్ పోల్ ప్రకారం గుజరాత్ లో మొత్తం 182 సీట్లకు గానూ బీజేపీ 139 సీట్లను సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ 30 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ 11 స్థానాలను దక్కించుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 2 సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపింది. 

ABP-CVoter

ఏబీపీ సీ ఓటర్ సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం గుజరాత్ లో బీజేపీదే మళ్లీ అధికారం అని తెలిపింది. కమలం పార్టీకి 128 నుంచి 140  సీట్లలో విజయ ఢంకా మోగిస్తుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ కు 31 నుంచి 43 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 3 నుంచి 11 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇతరులు 2 నుంచి ఆరుస్థానాలకు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
TV9 Gujarati 

గుజరాత్ లో మళ్లీ కమలం వికసిస్తుందని టీవీ 9 గుజరాతీ ఎగ్జిట్ పోల్  అంచనా వేసింది. బీజేపీకి 125 నుంచి 130 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్  40 నుంచి 50 సీట్లను సాధిస్తుందని అంచనా వేసింది. చీపురు పార్టీకి 3 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులు 3 నుంచి 7 సీట్లు కైవసం చేసుకుంటారని చెప్పింది. 

గుజరాత్ ఎన్నికలకుప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించింది. మోడీ సొంత రాష్ట్రంలో మరోసారి విక్టరీ సాధించేందుకు తొలి నుంచి పదునైన వ్యూహాలను రచించింది. మోర్బీ ఘటన పెద్ద ప్రభావం చూపలేకపోయినట్లు తెలుస్తోంది. ఇటు ఈ సారి త్రిముఖ పోరు ఉంటుందనుకున్న పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అంచనాలు తలకిందులయ్యాయి. కొత్త గుజరాత్ లోకి ఎంటరైన ఆమ్ ఆద్మీ పార్టీ 15శాతం ఓట్లు సాధిస్తోందని అంచనా వేస్తున్నారు.గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఈ సారి ఆ పార్టీకి ఘననీయంగా సీట్లు తగ్గుతాయని తెలుస్తోంది. గతం కంటే బీజేపీ మరింత పుజుకొని దాదాపు 140 సీట్ల వరకు కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ.. ఎంఐఎం పోటీ బీజేపీకి ప్లస్ అయ్యిందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. కాంగ్రెస్ ఓట్లను ఆమ్ ఆద్మీ ఘననీయంగా చీల్చింది. దీంతో హస్తం పార్టీకి సీట్లు తగ్గుతాయని చెప్పింది. ఢిల్లీ, పంజాబ్ తరహాలోనే గుజరాత్ లో పాగా వేస్తామంటూ రాష్ట్రంలో ప్రవేశించిన ఆమ్ ఆద్మీ.. పెద్దగా ప్రభావం చూపదని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలో రెండు విడతులగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో సౌరాష్ట్ర, కచ్, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా మొత్తం 39 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. 89 అసెంబ్లీ స్థానాల బరిలో మొత్తం 788 మంది అభ్యర్థులు నిలిచారు. మొదటి దశలో మొత్తం ఓటింగ్ శాతం 63.14గా నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

రెండో విడతలో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్‌తో సహా మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 స్థానాల్లో పోలింగ్ జరిగింది. రెండో దశలోని మొత్తం 93 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలిపింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయగా.. దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.  రాష్ట్రంలో కమలదళం మళ్లీ అధికారం చేపట్టే అవకాశమున్నట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.