ఆర్మీకి స్వేచ్ఛ ..ఇదే మా పాలసీ..

ఆర్మీకి స్వేచ్ఛ ..ఇదే మా పాలసీ..

2014 తర్వాతే ఆర్మీ  బలోపేతమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గతంలో  బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను దిగుమతి చేసుకునే వాళ్లమని..కానీ ఇప్పుడు మన దేశమే వాటిని ఎగుమతి చేస్తోందని చెప్పారు. ఆర్మీకి స్వేచ్ఛనివ్వడమే తమ పాలసీ అని చెప్పారు.  శత్రువులపై ముందు ఎటాక్ చేసి  ఆ తర్వాత తమకు నివేదించాలని సూచించారు.  నాయకత్వంలో మార్పు కారణంగా సైనికులు వారి పై అధికారులకు రిపోర్ట్ చేయాల్సి వస్తుందని..ప్రస్తుతం ఆ అవసరం లేదన్నారు.  శత్రువులపై  దాడి చేసిన తర్వాత దాని వల్ల కలిగిన ప్రయోజనాన్ని వివరించాలని చెప్పారు.  ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 23వ కార్గిల్ విజయ్ దివస్ లో జేపీ నడ్డా పాల్గొన్నారు. 

 దేశ రక్షణకు కట్టుబడి ఉన్నాం..
కాంగ్రెస్ హయాంలో దేశంలో  రక్షణ ఒప్పందాలన్ని  కుంభకోణాలతో దెబ్బతిన్నాయని జేపీ నడ్డా ఆరోపించారు.  కానీ మోడీ వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని చెప్పారు.  బీజేపీ దేశ రక్షణకు కట్టుబడి ఉందన్న ఆయన..మోడీ పాలనలో రక్షణ దళాలు ప్రశాంతంగా ఉండొచ్చన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని దేశానికి అందించారని తెలిపారు.   పుల్వామా, ఉరి  దాడుల తర్వాత సర్జికల్, ఎయిర్ స్ట్రైక్స్‌తో పాకిస్థాన్ కు  వారి భాషలోనే సరైన సమాధానం ఇచ్చామన్నారు. 

మోడీ వచ్చాకే మారింది..
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో త్రివిధ దళాలు ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నాయని జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో జవాన్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదని మండిపడ్డారు. అంతేకాకుండా  రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కుంభకోణాల వల్ల  ముఖ్యమైన ఒప్పందాలు ఆగిపోయాయన్నారు.  కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక.. దేశం  రక్షణ రంగంలో బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. భారత ఎయిర్ ఫోర్స్‌లోని 36 రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ చేరాయని... 28 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లు కూడా చేర్చామని నడ్డా గుర్తు చేశారు.