బీజేపీ బహిరంగ సభలు.. రాష్ట్రానికి మోడీ, అమిత్ షా, నడ్డా

బీజేపీ బహిరంగ సభలు.. రాష్ట్రానికి మోడీ, అమిత్ షా, నడ్డా

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మోడీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లను ఎన్నికల శంఖారావ సభలుగా మార్చుకొనేందుకు ప్లాన్ చేసింది. ఈ నెలలో నిర్వహించే సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ర్యాలీలు ఉండేలా పార్టీ పెద్దలు ఇది వరకే కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. ఈ నెలలో ముగ్గురు బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో దక్షిణ తెలంగాణలో నల్లగొండ లేదా ఖమ్మం జిల్లాలో ఏదో ఒక చోట సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటిస్తే సత్ఫలితాలు వస్తాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నది. గిరిజనులు, సింగరేణి కార్మికులను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నది. అయితే కర్నాటక సరిహద్దు సెగ్మెంట్లలోని జహీరాబాద్ సెగ్మెంట్ లో నడ్డా పర్యటిస్తే బాగుంటుందనే చర్చకూడా సాగుతోంది. 

ఆరు నెలల ముందే శంఖారావం

కర్నాటక ఫలితాలు ప్రతికూలంగా రావడంతో రాష్ట్ర బీజేపీ కాస్తా డీలా పడింది. ఇక్కడ సభలు నిర్వహించడం ద్వారా కార్యకర్తలు, నేతల్లో ఉత్తేజం నింపడం, ఆరు నెలల్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శంఖం పూరించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. మొదట హైదరాబాద్ లో మోడీ సభ నిర్వహించాలని భావించినప్పటికీ రూరల్ సెగ్మెంట్లపై దృష్టి సారిస్తే బాగుంటుందనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. దక్షిణాదిలో పార్టీకి పట్టున్న కర్నాటక చేజారిన నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అధికంగా ఫోకస్‌ చేస్తోందని, ఈ నేపథ్యంలో మోడీ సహా ఇతర నేతల ర్యాలీలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభల్లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షాతో పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.