టార్గెట్​ మున్సిపోల్స్​: కదులుతున్న బీజేపీ

టార్గెట్​ మున్సిపోల్స్​: కదులుతున్న బీజేపీ

    10లోపు మండల కమిటీలు, నెలాఖరుకు జిల్లా కమిటీలు

    అయోధ్యపై తీర్పు ఎలా ఉన్నా స్వాగతించాలి, సంబురాలొద్దు

    బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల అత్యవసర సమావేశంలో నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, దీని కోసం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే బూత్ కమిటీలవారీగా పార్టీలో చేరికలు, అభ్యర్థుల గుర్తింపు కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని అభిప్రాయపడింది. బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం ఆదివారం అత్యవసరంగా జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు, పార్టీ బూత్ కమిటీల నియామకం, గాంధీ సంకల్ప యాత్ర, అయోధ్య తీర్పు తర్వాత పార్టీ వైఖరి మొదలైన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలు రాంచందర్ రావు, చింతా సాంబమూర్తి, పేరాల శేఖర్ రావు, ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు.

అర్బన్​ ప్రజలకు చేరువ కావాలి

మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గాంధీ సంకల్ప యాత్రను ఎక్కువగా మున్సిపల్ ఏరియాల్లో కొనసాగించేలా చర్యలు చేపట్టాలని, దీంతో పట్టణ ప్రజలకు పార్టీ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుందని సమావేశం అభిప్రాయపడింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ లను మినహాయిస్తే మిగతా 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కోదాన్ని ఒక్కో క్లస్టర్ గా గుర్తించి, మున్సిపల్ ఇన్​చార్జ్​లను నియమించిన బీజేపీ, ఇప్పుడు ఒక్కో మున్సిపాలిటీకీ ఒక రాష్ట్ర నాయకుడికి బాధ్యత అప్పగించాలని భావిస్తోంది. మొత్తం 34 వేల బూత్ కమిటీలకు 14 వేల కమిటీలను నియమించామని, మిగతా కమిటీలను వెంటనే పూర్తి చేయాలని, 10లోపు పార్టీ మండల కమిటీలను, నెలాఖరులోపు జిల్లా కమిటీలను వేయాలని నిర్ణయించింది. త్వరలోనే అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుండడంతో తీర్పు ఎలా వచ్చినా స్వాగతించాలని, సంబరాలు వద్దని, పార్టీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో ఉండాలని ఆదేశించింది.