2047 నాటికి వికసిత్​ భారత్..ఐదేండ్లు ఫ్రీ రేషన్​

2047 నాటికి వికసిత్​ భారత్..ఐదేండ్లు ఫ్రీ రేషన్​
  • ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్.. 
  • ‘మోదీ గ్యారంటీ’ల పేరుతో హామీలు
  • సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు
  • వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా కృషి 
  • లక్​పతిదీదీలుగా మరో 3 కోట్ల మంది మహిళలు
  • ముద్రలోన్​ 10 లక్షల నుంచి 20 లక్షలకు..
  • ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పీ పెంపు
  • ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్ 

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశం(వికసిత్ భారత్)గా మారుస్తామని తెలిపింది. గత పదేండ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల కుటుంబాలకు ఇండ్లు కట్టించామని, మళ్లీ అధికారం ఇస్తే మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది పేదలకు ఐదేండ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. 

‘సంకల్ప పత్రం’ పేరుతో  ‘మోదీ గ్యారంటీ’ అనే హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ముద్ర స్కీం కింద స్వయం ఉపాధి కోసం రూ. 10 లక్షల వరకూ రుణాలు ఇస్తున్నామని.. ఈ రుణాల పరిమితిని రూ. 20 లక్షలకు పెంచుతామని పేర్కొంది. ‘లక్​పతి దీదీ’ పథకం కింద కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని.. మళ్లీ గెలిపిస్తే మరో 3 కోట్ల మంది మహిళలను లక్ పతి దీదీలుగా మారుస్తామని మాట ఇచ్చింది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోదీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘సంకల్ప పత్రం’ పేరిట రూపొందించిన ఈ మేనిఫెస్టోలో ‘అభివృద్ధి చెందిన భారత్’కు నాలుగు మూలస్తంభాలైన పేదలు, యువత, రైతులు, మహిళలు(గరీబ్, యువ, అన్నదాత, నారీశక్తి- గ్యాన్)పైనే మేనిఫెస్టోలో ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు ప్రకటించారు. ఈ మేనిఫెస్టో తాను దేశ ప్రజలకు ఇస్తున్న గ్యారంటీ అని చెప్పారు. దేశ ప్రజలకు ‘హుందాతో కూడిన నాణ్యమైన జీవితం, అపారమైన, నాణ్యమైన అవకాశాలు’ కల్పించడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించామన్నారు.

ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చాం 

గత పదేండ్లలో తన ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చామని మోదీ చెప్పారు. ‘‘మనం చంద్రయాన్ సక్సెస్ ను చూశాం. ఇప్పుడు గగన్​యాన్ విజయాన్ని చూస్తాం. మనం జీ20 ద్వారా ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇచ్చాం. ఇప్పుడు భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించి సత్తా చాటుతాం. ఇది అభివృద్ధి దారిలో దూసుకుపోతున్న నయా భారత్. దీనిని ఆపడం అసాధ్యం” అని మోదీ స్పష్టం చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు తాము ఇప్పుడే రంగం సిద్ధం చేసుకున్నామన్నారు. తమను గెలిపిస్తే సంకల్ప పత్రాన్ని వేగవంతంగా అమలు చేస్తామన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను అవినీతి పట్టి పీడిస్తోందని, అందుకే అవినీతిపరులను తాము జైళ్లకు పంపుతున్నామన్నారు. మళ్లీ గెలిపిస్తే అవినీతిపరులపై కఠిన చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. 
 
మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్ 

గతంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ ను తాము 5వ స్థానంలోకి తెచ్చామని, మరోసారి గెలిపిస్తే దేశాన్ని మూడో అతిపెద్ద ఎకానమీగా మారుస్తామని మోదీ చెప్పారు. సరైన పాలసీలు రూపొందించి, పక్కాగా అమలు చేస్తేనే ఇది సాధ్యం అవుతుందన్నారు. దేశ రక్షణను మరింత పటిష్టం చేసేందుకు గాను చైనా, పాకిస్తాన్, మయన్మార్ బార్డర్లలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేస్తామన్నారు. సరిహద్దుల్లో టెక్నాలజీని వాడుకుని స్మార్ట్ ఫెన్సింగ్ ను నిర్మిస్తామన్నారు. 

సీఏఏ, యూసీసీలను అమలు చేస్తాం

అభివృద్ధితోపాటు వారసత్వాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని మోదీ చెప్పారు. అందుకే తాము మరోసారి గెలిస్తే ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్ నిర్వహిస్తామన్నారు. తమిళ భాష, సంస్కృతి ఎంతో ప్రాచీనమైనవని,ప్రఖ్యాత తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ పేరిట ప్రపంచవ్యాప్తంగా కల్చరల్ సెంటర్లు పెడతామన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ), సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)లను అమలు చేస్తామన్నారు. యూసీసీ అమలుతో మాత్రమే మహిళలకు సమాన హక్కులు వస్తాయన్నారు. అలాగే వన్ నేషన్, వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) అమలుపై అధ్యయనం కోసం ఇప్పటికే కమిటీని నియమించామని, మరోసారి అధికారం ఇస్తే ఆ కమిటీ సిఫారసుల అమలుకు కృషి చేస్తామన్నారు.  

మేనిఫెస్టోలో కీలక హామీలు ఇవే.. 

  •     రైతులకు పీఎం కిసాన్ పథకం కింద ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం కొనసాగింపు. 
  •     టెక్నాలజీ వినియోగం ద్వారా పంటల బీమా పథకం మరింత బలోపేతం
  •     ముద్ర లోన్ల పరిమితి రూ.20 లక్షలకు పెంపు 
  •     నిత్యావసరాల ఉత్పత్తి పెంచడం కోసం ప్రత్యేకంగా పంటల క్లస్టర్ల ఏర్పాటు. స్టోరేజీ సౌలతుల పెంపు. 
  •     70 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ స్కీం వర్తింపు.  
  •     ఇండస్ట్రియల్, కమర్షియల్ సెంటర్లకు సమీపంలో మహిళల కోసం విమెన్స్ హాస్టల్స్, ఇతర సౌలతులు.
  •     మహిళలకు ఆరోగ్య సేవల విస్తరణ. ఎనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్ నివారణపై ఫోకస్. 
  •     చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్  అధినీయం చట్టం అమలుకు చర్యలు. 
  •     ఆటో, ట్యాక్సీ, ట్రక్కు, ఇతర డ్రైవర్లకు సామాజిక భద్రతా పథకాల వర్తింపు 
  •     2036లో దేశంలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణ 
  •     న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, పేపర్ లీక్స్ నివారణ చట్టం అమలు 
  •     ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ ల బలోపేతం 
  •     రైల్వే ప్రయాణంలో వెయిటింగ్ లిస్ట్ లు రద్దు 
  •     5జీ విస్తరణ, 6జీ సేవలపై కసరత్తు   
  •     అన్ని ఇండ్లకూ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఫ్రీ కరెంట్, పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరా 
  •     పప్పులు, వంట నూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధితో ధరల కట్టడి 
  •  ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు.

సైడ్ లైట్స్: 

  • కేంద్ర పథకాల నుంచి ప్రయోజనం పొందిన పలువురు లబ్ధిదారులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించి, వారిని నేతలు సన్మానించారు. 
  •     ఆదివారం అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో వేదికపై బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, రాజ్యాంగం ప్రతిని కూడా ఉంచారు.  
  •     ప్రధాని మోదీ, పార్టీ చీఫ్​జేపీ నడ్డా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్ నాథ్ సింగ్ ఫొటోలతో 76 పేజీల మేనిఫెస్టోను రూపొందించారు. 
  •     కొత్తగా ప్రజాకర్షక పథకాల జోలికి పోకుండానే ఉన్న పథకాలను కొనసాగిస్తూ, అభివృద్ధిపై ఫోకస్ పెడుతూ హామీలు పేర్కొన్నారు. 
  •     మేనిఫెస్టోలో ప్రతి చోటా ఇండియాకు బదులుగా భారత్ అనే పదాన్ని మాత్రమే వాడారు. 
  •     2019 మేనిఫెస్టోలో ఎన్ఆర్ సీ అమలు చేస్తామని పేర్కొనగా.. ఈ సారి ఆ ఊసే ఎత్తలేదు. 
  •     మేనిఫెస్టోలో ప్రతి హామీనీ ‘మోదీ కీ గ్యారంటీ’ పేరుతో పేర్కొన్నారు. 


మా పదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన నినాదం ‘మోదీ గ్యారంటీ’. ఇది బీజేపీ ఇచ్చే అన్ని హామీలనూ నెరవేర్చే గ్యారంటీ
- జేపీ నడ్డా, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ 

మేం చెప్పింది చేస్తాం. ఆర్టికల్ 370ని రద్దు చేశాం. మహిళా బిల్లును పాస్ చేశాం. అయోధ్యలో రాముడికి గుడి కట్టించినం. గతంలో ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా 15 లక్షల సూచనలు, సలహాలు తీసుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించాం. సామాజిక న్యాయంపై దృష్టిపెడుతూనే వికసిత్ భారత్ కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశాం. మోదీ గ్యారంటీ అంటే 24 క్యారట్ల బంగారం వంటిది. అందుకే మాది  ప్రపంచ పార్టీల మేనిఫెస్టోల్లోనే గోల్డ్ స్టాండర్డ్ మేనిఫెస్టో. 
 - రాజ్ నాథ్ సింగ్, బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ 

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న సమయమిది. అందుకే భారత్​లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలబడగలుగుతుంది. నేను ఇదివరకే ఎర్రకోటపై ప్రసంగంలోనే.. వెయ్యేండ్లపాటు నిలిచిపోయేలా దేశం తలరాతను మార్చేందుకు ఇదే సరైన సమయమని ప్రకటించా. ఇందులో భాగంగానే బీజేపీ సంకల్ప పత్రాన్ని  మోదీ గ్యారంటీగా దేశ ప్రజల ముందు ఉంచుతున్నా. 140 కోట్ల మంది ప్రజల యాంబిషనే.. మోదీ మిషన్.  
- ప్రధాని నరేంద్ర మోదీ