- సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోంది: ఖర్గే
- రెండు వారాల్లోపే 4వ సారి ఇంధన ధరలు పెరగడంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంధన దోపిడీ కారణంగా దేశంలోని రైతాంగం, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందని విమర్శించారు. రెండు వారాల్లోపే వరుసగా నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై సోమవారం ‘ఎక్స్’ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘‘రోజువారీ ఇంధన లూటీ దాడి ఇంకా ముగియలేదు!” అని విమర్శించారు. గత 12 ఏండ్ల కాలంలో మోదీ ప్రభుత్వం ప్రజల నుంచి ఏకంగా రూ.42 లక్షల కోట్లను లూటీ చేసిందని, ఇది రోజుకు దాదాపు
రూ.వెయ్యి కోట్ల దోపిడీతో సమానమని ఆరోపించారు. ప్రతీ ఇంధన ధరల పెంపు సామాన్యుడి గృహ బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తోందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై పడుతుందని పేర్కొన్నారు.
యూపీఏకు.. మోదీ ప్రభుత్వానికి చాలా తేడా
2004-–2014 మధ్యకాలంలో సాగిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలనను ఖర్గే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 175.34% పెరిగినప్పటికీ, సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. కానీ, మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగకపోయినా దేశీయంగా ధరలు పెంచి ప్రజల పొదుపు మొత్తాలను తగలబెడుతోందని విమర్శించారు.
‘‘2014లో రూ.71.41 ఉన్న పెట్రోల్ ధరను ఈ రోజు 2026 నాటికి రూ.102.12 కి (43.01% ) పెంచారు. అలాగే డీజిల్ ధరను రూ.56.71 నుంచి రూ. 95.20 కి (67.87%) పెంచేశారు. బీజేపీకి ప్రజల కంటే లాభాలే ముఖ్యం. ఈ రోజు ఇంధన ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో 4 నుంచి 6% లాభపడ్డాయి. ఈ రోజువారీ దోపిడీ వల్ల లాభపడుతోంది ఎవరు?’’ అని ఖర్గే ప్రశ్నించారు.
