- గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు బీజేపీ నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర శాసనసభలో జాతీయ గేయం వందేమాతరం ఆలాపన జరుగుతుండగా గౌరవించకుండా వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసిన బీజేపీ నేతలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడారు.
దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించిన సదరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. వందేమాతర ఆలపన సమయంలో వాకౌట్ చేయడం కేవలం సభా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, ఇది దేశానికి జరిగిన అవమానమని రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
సభ గౌరవాన్ని దిగజార్చిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం కాంగ్రెస్ వైఖరి అని విమర్శించారు.
