మంత్రివర్గంలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇయ్యాలె

మంత్రివర్గంలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇయ్యాలె

హైదరాబాద్: నెలనెలా జీతాలకే పైసల్లేవ్... బంగారు తెలంగాణ ఎట్లైతదని సీఎం కేసీఆర్ ను బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ ప్రశ్నించారు. ప్లీనరీలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన తీర్మానాలపై బుధవారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో డీకే అరుణ మాట్లాడారు. నోరు తెరిస్తే కేసీఆర్ బంగారు తెలంగాణ అంటుంటారని... బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే కానీ ప్రజలకు కాదన్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్... ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల పాలుజేశారని దుయ్యబట్టారు. దేశం మొత్తం దళిత బంధు అమలు చేయాలని కేసీఆర్ అడుగుతున్నారన్న ఆమె ... మొదట రాష్ట్రంలో దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని కేసీఆర్ మహిళల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్న కేసీఆర్... మొదట ఆయన కేబినెట్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించిన ఆమె... ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి తన ఫాం హౌజ్ కు కేసీఆర్ నీళ్లు తెచ్చుకున్నారని ఆరోపించారు.

సైనిక్ స్కూళ్లను రాష్ట్రానికి మంజూరు చేస్తే... ఇప్పటికీ వాటికి గుంట స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, ఇప్పుడేమో నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలు అంటూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారన్నారు. చేనేత ఫండ్ మొత్తాన్ని సిరిసిల్లాకే ఇస్తున్నారని, మిగతా ప్రాంతాలను అసలు పట్టించుకోవడంలేదని తెలిపారు. అన్ని రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గిస్తోంటే కేసీఆర్ మాత్రం ఒక్క పైసా తగ్గించకుండా కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రజలకు, కేంద్రానికి మధ్య కేసీఆర్ ఓ మధ్యవర్తిలా వ్యవహరిస్తున్నారే తప్ప ఆయన గొప్పదనం ఏంలేదన్నారు. మోడీని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదని, తన స్థాయిని పెంచుకోవడానికే కేసీఆర్ మోడీపై చిల్లర విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం...

చైనీయుల ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటాం

పెట్రో ధరలు రాష్ట్రాలే తగ్గించాలన్న మోడీపై కాంగ్రెస్ ఫైర్