రూ. 27 లక్షల కోట్ల లెక్క చెప్పండి

రూ. 27 లక్షల కోట్ల లెక్క చెప్పండి

పెట్రో ధరలు తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేయడంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం ముందుగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ఆ తర్వాత వ్యాట్ తగ్గించమని రాష్ట్రాలకు చెప్పాలని సూచించింది.  మోడీ అధికారంలోకి వచ్చాక లీటర్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.18 కిపైగా  పెంచారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా వెల్లడించారు. యూపీఏ హయాంలో లీటర్ పెట్రోల్పై రూ.9.84 ఎక్సైజ్ డ్యూటీ ఉండగా.. మోడీ దాన్ని రూ.27.90కు, లీటర్ డీజిల్పై  రూ.3.56గా ఉన్న సుంకాన్ని రూ.21.80కు పెంచారని మండిపడ్డారు.  వ్యాట్ తగ్గించమని రాష్ట్రాలను కోరే ముందు దయచేసి పెట్రోల్పై పెంచిన 18.42, డీజిల్పై పెంచిన రూ.21.80 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని సుర్జేవాలా సూచించారు.

ఇదిలా ఉంటే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో లక్షల కోట్లు ఆదాయం వస్తున్న విషయాన్ని ప్రధాని ఎందుకు దాస్తున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.26 లక్షల కోట్ల ఆదాయం వచ్చిన విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాల వాటాను సకాలంలో చెల్లించని కేంద్రం ఇప్పుడు వ్యాట్ తగ్గించాలని ఎందుకు అడుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ తొలుత ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ తర్వాత రాష్ట్రాలను వ్యాట్ తగ్గించాలని చెప్పాలని అన్నారు.