కారు బాంబు పేలుడు.. పాక్కు చైనా వార్నింగ్

కారు బాంబు పేలుడు.. పాక్కు చైనా వార్నింగ్

దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. మంగళవారం (26న) కరాచీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందిగా.. అందులో ముగ్గురు చైనీయులు ఉన్నారు. కరాచీ యూనివర్శిటీలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని డ్రాగన్ తీవ్రంగా ఖండించింది. చైనీయులు చిందించిన ప్రతి రక్తపు బొట్టునూ వృథా కానివ్వమని, ఈ ఘటన వెనుక బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగశాఖ హెచ్చరించింది. తమ దేశీయులకు మరింత భద్రత కల్పించాలని పాక్ ను డిమాండ్ చేసింది. 

కరాచీ యూనివర్శిటీలో స్థానిక విద్యార్థులకు చైనీస్ భాషను బోధించే కన్ఫూసియస్ ఇనిస్టిట్యూట్ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. బుర్ఖా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చైనీస్ టీచర్లు, పాక్ కు చెందిన ఒక వ్యాన్ డ్రైవర్ మృతిచెందారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వు జియాంగావో.. చైనాలోని పాక్ రాయబారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని పాక్ ను డిమాండ్ చేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి వెల్లడించారు. 

ఈ దాడి తమ పనేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఘటన అనంతరం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘బలూచిస్తాన్ నుంచి పాక్, చైనా వెంటనే వెళ్లిపోవాలి. లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. చైనీయులపై దాడి కోసం ప్రత్యేక యూనిట్ నే ఏర్పాటు చేశాం’ అని తుపాకీ పట్టుకున్న ఓ వ్యక్తి ఆ వీడియాలో హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి.

ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులుగా ఉన్న బలూచిస్తాన్ లో చైనా-పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ లో భాగంగా రెండు దేశాలు పలు ప్రాజెక్టులు చేపట్టాయి. అయితే.. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న బలూచ్ వేర్పాటు వాదుల బృందం గతంలోనే చాలాసార్లు చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. గతేడాది జులైలో కరాచీలో ఇద్దరు చైనీయులపై కాల్పులు జరిపి చంపేశాయి. అదే నెలలో ఈశాన్య పాకిస్తాన్ లో చైనా ఇంజినీర్లతో వెళ్తున్న ఓ బస్సుపై దాడి చేయగా.. 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో వివిధ వ్యాపారాలు, ప్రాజెక్టుల పనుల కోసం చైనా తమ దేశ పౌరులను అక్కడికి పంపింది. తాజాగా జరిగిన బాంబు దాడిలో ఈ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనీయులు ముగ్గురు చనిపోవడంతో చైనీస్ స్టేట్ మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఈ పేలుడును తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌లోని చైనా ప్రాజెక్టులు, సిబ్బందిని రక్షించడానికి పాక్‌ చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అలాగే, ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. 

మరిన్ని వార్తల కోసం..

కోవిడ్ ముప్పు ఇంకా పోలె

ఏ వర్గానికి బీజేపీ మేలు చేయలేదు