జూబ్లీహిల్స్ సెగ్మెంట్కు ఆరుగురి పేర్లు.. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కు త్రిసభ్య కమిటీ రిపోర్ట్

జూబ్లీహిల్స్ సెగ్మెంట్కు ఆరుగురి పేర్లు..  బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కు త్రిసభ్య కమిటీ రిపోర్ట్
  •     10న సమావేశం.. అదేరోజు జాతీయ కమిటీకి ముగ్గురి పేర్లు 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అభిప్రాయ సేకరణకు నియమించిన త్రిసభ్య కమిటీ పలువురు పేర్లతో కూడిన నివేదికను బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావుకు అందించింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్​లో అభ్యర్థి కోసం ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత కోమల ఆంజనేయులుతో కూడిన కమిటీని ఇటీవల నియమించింది. సోమ, మంగళవారం జూబ్లీహిల్స్ లోని నేతలు, జిల్లా నేతల అభిప్రాయాలను సేకరించారు.

 ఈ క్రమంలో సిటీ ఆఫీసులో జరిగిన సమావేశంలో 12 మంది పోటీలో ఉండేందుకు ముందుకు రాగా.. వారిలో ఆరుగురి అభ్యర్థిత్వాన్ని బలపర్చినట్టు తెలిసింది. దీంతో ఆ ఆరుగురి పేర్లతో కూడిన లిస్టును రాంచందర్​రావుకు కమిటీ అప్పగించింది. ఈ క్రమంలో ఈ నెల 10న బీజేపీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. అనంతరం ఈ ఆరుగురి పేర్ల నుంచి ముగ్గురి పేర్లు ఫైనల్​ చేసి జాతీయ నాయకత్వానికి పంపించనున్నారు. అనంతరం రాష్ట్ర నాయకత్వం సూచించిన అభ్యర్థిని జాతీయ కమిటీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

మానిటరింగ్ కమిటీతో కిషన్​రెడ్డి, రాంచందర్​రావు భేటీ..

బీజేపీ ఉప ఎన్నికపై ఎన్నికల మానిటరింగ్ కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ హోటల్​లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బై ఎలక్షన్​లో అనుసరించాల్సిన వ్యూహంపై, బీజేపీ ప్రచార పరిస్థితిపై చర్చించారు. ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తే.. ప్రచారానికి ఈజీగా ఉంటుందని నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఎంపీ రఘునందన్​రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తదితరులు అటెండ్ అయ్యారు.