ఉత్తరాఖండ్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్

ఉత్తరాఖండ్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్
  • ఉత్తరాఖండ్​లో అధికారం నిలబెట్టుకోవాలె
  •  భారీ టార్గెట్​తో  టాప్​ లీడర్లతో  ప్రచారం
  •  రేపటి నుంచే మెగా క్యాంపెయిన్ షురూ
  • దేవభూమిపై బీజేపీ స్పెషల్​ ఫోకస్

న్యూఢిల్లీ, వెలుగు: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. కీలకమైన యూపీలో మరోసారి కమలం వికసిస్తుందన్న సర్వేలతో ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది. ప్రధానంగా దేవభూమి ఉత్తరాఖండ్ లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వ్యూహాలకు మరింత పదునుపెట్టింది. పోలింగ్ కు మరో రెండు వారాలే ఉండడంతో మెగా క్యాంపెయిన్ కు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా మరోసారి ప్రధాని మోడీని రంగంలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. మోడీ ప్రచారం విషయంపై ఉత్తరాఖండ్ బీజేపీ ఇంచార్జ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆదివారం క్లారిటీ ఇచ్చారు. ‘ఉత్తరాఖండ్ లో క్యాంపెయిన్ చేసేందుకు మోడీ అంగీకరించారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసే గైడ్ లైన్స్ ఆధారంగా విధివిధానాలు సిద్ధం చేస్తాం’ అని ఆయన చెప్పారు. 2017 ఎన్నికల్లో మోడీ చరిష్మాతోనే ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ వేవ్, కేంద్ర నిర్ణయాల ఎఫెక్ట్ తో 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ59 స్థానాల్లో గెలిచి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సారి కూడా భారీ మెజార్టీ లక్ష్యంగా కాషాయ దళం ముందుకు వెళ్తోంది. 

భారీ ఎల్ఈడీ స్కీన్ల ఏర్పాటు..  
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా, కరోనా ఎఫెక్ట్ తో బహిరంగ సభలు, ర్యాలీలను కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. అయితే, మెల్లి మెల్లిగా నిబంధనలను సడలిస్తోన్న నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి బీజేపీ మెగా క్యాంపెయిన్ పేరిట ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, బీజేపీ చీఫ్ నడ్డా ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయేందుకు ప్రణాళిక రూపొందించింది. మొత్తం 70 నియోజక వర్గాల్లో ముఖ్యమైన 10, 15 చోట్ల భారీ ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేయనుంది.  

అసమ్మతి నేతలతో ముప్పు?  
ఉత్తరాఖండ్ లో 2017లో భారీ మెజార్టీతో గెలుపొందిన బీజేపీకి ప్రస్తుతం అసమ్మతి వర్గం నుంచి త్రెట్ కనిపిస్తోంది. 59 సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 10 మందికి ఈ సారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో వీరంతా బీజేపీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. 2016లో కాంగ్రెస్ లో తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిన హరక్ సింగ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 2017లో కాంగ్రెస్ ను 10 సీట్లకు పరిమితం చేయడంలో హరక్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా హరక్ సింగ్ ఎఫెక్ట్ రాష్ట్రంలో బాగానే కన్పిస్తోంది. కొందరు ఇండిపెండెంట్లుగా బరిలో దిగారు. మరోవైపు పలుమార్లు సీఎంల మార్పు కూడా ఇక్కడ బీజేపీకి మైనస్ గా మారే చాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీని బీజేపీ ఎదుర్కొంటోందని చెబుతున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ సైతం బీజేపీకి గట్టి పోటినిస్తోంది. అయితే, ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నా.. మోడీ చరిష్మా ముందు తీసిపోతాయని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. మోడీ హవాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇస్తున్న ప్రియారిటీ, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మేలనే ప్రచారం జోరుగా సాగుతోంది.  
ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ దే..  
‘ఈ శతాబ్దంలో మూడో దశాబ్దం(2020-2030) ఉత్తరాఖండ్ దే. ఎక్కువ మంది యాత్రికులతో, యువతరం వలసలు లేకుండ, వేగవంతమైన కొండ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతం ఎగ్జాంపుల్ గా మారుతుంది. ఇది నా మాట..’ అంటూ ప్రధాని మోడీ ఇదివరకే ఉత్తరాఖండ్ ప్రజలకు హామీ ఇచ్చారు. గత నవంబర్​లో అక్కడ పర్యటించిన మోడీ.. రూ. 409 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. డిసెంబర్ 4, 30 తేదీల్లోనూ పలు శంకుస్థాపనలు చేశారు. జాతీయ వేదికలపై సైతం ఉత్తరాఖండ్​కు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదు సార్లు కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. రిపబ్లిక్ డే వేడుకల్లోనూ బ్రహ్మకమలం బొమ్మ ఉన్న ఉత్తరాఖండ్ టోపీని ధరించి రాజ్ పథ్​లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కేదార్ నాథ్ వెళ్లినప్పుడు కూడా మోడీ ఇదే టోపీని ధరిస్తుంటారు.