ఏడేండ్లలో అన్నీ ఫెయిల్యూర్సే

ఏడేండ్లలో అన్నీ ఫెయిల్యూర్సే

తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకుని ఏడేండ్లు పూర్తయింది. రెండుసార్లు అధికారంలోకి రావడంలో తెలివైన రాజకీయ నాయకుడనిపించుకున్న ఆయన.. పాలకుడిగా మాత్రం ఫెయిల్‌‌ అయ్యారు. 60 ఏండ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని బాగుచేసి తమకు మెరుగైన జీవితాన్ని అందించే అపూర్వ అవకాశాన్ని ఆయనకు ఇచ్చారు. కానీ ఏడేండ్లుగా కేసీఆర్ పాలనంతా ప్రజల ఆశలను వమ్ము చేస్తూ.. ఘోర వైఫల్యాలతోనే సాగుతోంది.

ప్రతిపక్షాలు, మీడియా గొంతునొక్కి..
కేసీఆర్ తెలంగాణ సీఎంగా 2014లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పౌర హక్కులను  ఒక పద్ధతి ప్రకారం నీరుగార్చారు. మీడియాను కట్టడి చేసి దాన్ని గొంతు నొక్కారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టుల ద్వారా ప్రతిపక్షాల నిరసనలను అణిచేశారు. ధర్నా చౌక్లను తొలగించి ప్రజా సమస్యలపై దీక్షలు చేసే హక్కును తుంచేశారు. 

వ్యవస్థలను భ్రష్టుపట్టించిండు
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాసనసభలో జవాబుదారీతనం, సమాన అవకాశాలు అనే సంప్రదాయాలు అనుసరించడంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు ఎవరూ మాట్లాడకుండా స్పీకర్ ద్వారా కట్టడి చేయించి, అసెంబ్లీని ఒక ప్రహసనంగా మార్చేశారు. వ్యతిరేకించే పక్షం లేకుండా చేసి.. సభలో పచ్చి అబద్దాలు మాట్లాడి సులభంగా తప్పించుకుంటున్నారు. ఇక ఏడేండ్లలో సీఎం కేసీఆర్ కనీసం ఏడు సార్లు కూడా రాష్ట్ర సచివాలయం గడపతొక్కి ఉండరు. దేశంలోనే తొలి “వర్క్ ఫ్రమ్ హోమ్” సీఎంగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు.

అభివృద్ధి, సాధికారత ప్రణాళికల్లేవ్
ఏపీ నుంచి విడిపోయే నాటికి తెలంగాణకు రూ.60 వేల కోట్లు అప్పుల భారం ఉన్నా..  ఆదాయపరంగా మిగులు రాష్ట్రంగానేఉంది. కానీ కేసీఆర్‌‌ పాలనా వైఫల్యాల వల్ల మూడేళ్లలోనే  రెవెన్యూ మిగులు రాష్ట్రమనే  హోదాను తెలంగాణ కోల్పోయింది. రాష్ట్ర అప్పులు మూడు లక్షల కోట్ల రూపాయాలపైనే పెరిగాయి. ఉమ్మడి ఏపీ నుంచి వారసత్వంగా లభించిన ఐటీ రంగం తప్ప సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో మరే రంగం కూడా అభివృ-ద్ధి చెందలేదు.రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం ఏడేండ్లుగా దారుణంగా దెబ్బతిన్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఒక అపూర్వ అవకాశాన్ని సీఎం కేసీఆర్ చేజేతులా నాశనం చేసుకున్నారని చెప్పక తప్పదు. విలువైన ఏడేండ్ల కాలాన్ని కోల్పోయాం. కనీసం తన పదవీకాలంలో మిగిలిన మూడు సంవత్సరాలైనా కేసీఆర్ తన సుదీర్ఘ అవిధేయతను పక్కన పెట్టి రాష్ట్రానికి సేవ చేస్తారని ఆశిస్తున్నాను.

కేబినెట్‌‌ రోల్ శూన్యం
ఎన్నికైన ప్రభుత్వం గవర్నర్ నేతృత్వంలో సీఎం, కేబినెట్ సహకారంతో పని చేస్తుంది. కానీ పాలనలో సీఎం కేసీఆర్ తన మంత్రుల పాత్రను, బాధ్యతను శూన్యంగా మార్చేశారు. రాష్ట్రంలో ఏడేండ్లుగా “వన్ మ్యాన్ షో” సాగుతోంది. ఈ షోకు ఆయన కుమారుడు కేటీఆర్, అప్పుడప్పుడు మేనల్లుడు హరీశ్ రావు వాద్య సహకారం అందిస్తున్నారు. 

- కె.కృష్ణసాగర్ రావు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి