పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షన్నర అప్పు మోపిండు

పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షన్నర అప్పు మోపిండు
  • సీఎం కేసీఆర్​పై బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ఫైర్
  • రైతు బంధు పేరు చెప్పి అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు
  • కరెంట్​ బిల్లులు, బస్సు చార్జీలు, అన్ని రకాల పన్నులు పెంచిండు
  • కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దుర్వినియోగం చేసి క్లౌడ్​ బరస్ట్​ అంటూ నాటకాలాడుతున్నడు
  • కారు గుర్తు మీద గెల్వబోమని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలే అంటున్నరు
  • వచ్చేది బీజేపీ సర్కారేనని ధీమా

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్​ సర్వనాశనం చేశారని, పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షన్నరకుపైగా అప్పుల భారం మోపారని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ కుటుంబం మాదిరిగానే  శ్రీలంకలో ఒకే కుటుంబం రాజ్యమేలడం వల్ల ఆ దేశం బిచ్చమెత్తుకుంటున్నది” అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్లౌడ్ బరస్ట్ అంటూ కేసీఆర్​ నాటకాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బుధవారం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని సాగర్ రోడ్డులో జరిగింది. ఈ సమావేశంలో బండి సంజయ్​ మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ పేరుతో డిస్కంలకు రూ.60 వేల కోట్లు బకాయి పెట్టిన ఘనుడు కేసీఆర్​ అని, ఇట్లనే ఉంటే రాష్ట్రంలో నిరంతరాయంగా కనీసం గంటసేపు కూడా కరెంట్​ను సరఫరా చేయలేని ప్రమాదం ఏర్పడుతుందన్నారు.  

భయపడే ప్రసక్తే లేదు.. 

ప్రజల తరఫున బీజేపీ అనేక పోరాటాలు చేస్తున్నదని, కేసులు, లాఠీలకు భయపడే ప్రసక్తే లేదని సంజయ్​ చెప్పారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో దేశంలో ఎక్కడా సమస్య లేకపోయినా తెలంగాణలో మాత్రం కేసీఆర్​ లేనిపోని సమస్యలు సృష్టించి, రైతులు ఇబ్బంది పడుతుంటే రాక్షసానందం పొందుతున్నారని ఆయన అన్నారు. ‘‘ధాన్యం కొనుగోళ్ల పేరుతో కేసీఆర్  చేసిన డ్రామాలను చూసి జనం ఛీ కొట్టారు. ముందస్తు ఎన్నికల పేరుతో ఆడిన డ్రామాలు కూడా బెడిసికొట్టాయి”అని తెలిపారు. కేసీఆర్​ డ్రామాలు ఇక సాగవని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

‘‘కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తున్నట్లు.. ఇకపై కేంద్రానికి ధాన్యం ఇవ్వబోమంటూ కరాఖండిగా చెప్పిన కేసీఆర్.. ఆ ధాన్యాన్ని ఏ దేశానికి అమ్మబోతున్నారోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసీఆర్ తీరును చూసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవ్వుకుంటున్నారు” అని బండి సంజయ్​ అన్నారు. కేంద్రం వద్దకు పోయి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకం చేసిన కేసీఆర్ ... ఆ తర్వాత మాట మార్చారని తెలిపారు. ‘‘పంటల విషయంలోనూ కేసీఆర్ కు క్లారిటీ లేదు. ఒకరోజు సన్న వడ్లు పండించాలంటడు... మరోరోజు వరి వేస్తే ఉరే గతి అంటడు.. ఆయన ఫాంహౌస్​లో మాత్రం దొడ్డు వడ్లు పండిస్తడు. భూసార పరీక్షలు నిర్వహించాలని రూ.100 కోట్లు కేంద్రం మంజూరు చేస్తే.. ఆ నిధులను దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్” అని  సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణలో గత ఎనిమిదేండ్లలో అకాల వర్షాల వల్ల లక్షలాది ఎకరాల పంట నష్టంతోపాటు పశు సంపదను రైతులు కోల్పోయారు. కానీ ఒక్క రైతును కూడా కేసీఆర్​ ఆదుకోలేదు” అని అన్నారు. ‘‘కేసీఆర్ వంద రంగాల్లో నిపుణుడు. కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకొమ్మంటడు. నీళ్ల దగ్గరకు పోతే.. ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ పేరుతో రూ.30 వేల కోట్ల అంచనా వ్యయాన్ని రూ. 1.30 లక్షల కోట్లకు పెంచిండు. వానలు కురిస్తే.. క్లౌడ్ బరస్ట్ అంటూ వాతావారణ శాస్త్రవేత్త అవతారమెత్తిండు” అని ఆయన దుయ్యబట్టారు. 

కేసీఆర్​ పతనం ఖాయమైంది

రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల తెలంగాణలో రైతులు ఏడుస్తున్నారని బండి సంజయ్​ అన్నారు. ‘‘ఎద్దు ఏడిసిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు. అందుకే కేసీఆర్ పతనం ఖాయమైంది” అని అన్నారు. ఈ విషయం తెలిసే ముందస్తు ఎన్నికల పేరుతో మరో డ్రామా చేస్తున్నారని, కేసీఆర్ బొమ్మతో ఎన్నికలకు వెళితే... గెలిచే అవకాశాల్లేవని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరాఖండిగా చెప్తున్నారని తెలిపారు. టీఆర్​ఎస్​లోని ఏ ఎమ్మెల్యే కూడా కారు గుర్తుపై  పోటీ చేయడానికి సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. ‘‘కేసీఆర్​, ఆయన కుటుంబం చేస్తున్న దోపిడీ, వ్యవహరిస్తున్న తీరు, వాడుతున్న భాషను చూసి జనం తిరగబడుతున్నరు. ఈ విషయం తెలిసి కేసీఆర్ ఇప్పుడు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను బురడీ కొట్టించే పనిలో పడ్డారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన మూర్ఖుడు కేసీఆర్. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది” అని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం యూరియా, డీఏపీ, కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏటా రెండు పంటలకు కలిపి ఒక్కో ఎకరాకు రూ. 41 వేల మేరకు సాయం అందిస్తున్ననదని బండి సంజయ్​ తెలిపారు.  రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతు బంధు మాత్రమే ఇచ్చి అన్ని రకాల సబ్సిడీలను బంద్ చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నదన్నారు. ‘‘ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని కేసీఆర్​..రైతులను ఎట్లా ఆదుకుంటడు” అని ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నదంటూ కేంద్రాన్ని  కేసీఆర్​ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన లేవడానికి కారణమైన జర్నలిస్టులను కూడా కేసీఆర్ మోసం చేశారని, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేస్తామని, హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. 

తల ఎప్పుడు నరుక్కుంటడో చూడాలి

‘‘దళితుడిని సీఎం చేయకుంటే తల నరుక్కుంటా అన్న కేసీఆర్... ఎప్పుడు నరుక్కుంటడో చూడాలి. దళితులను అన్ని రకాలుగా కేసీఆర్ దగా చేసిండు. కారు గుర్తుతో పోటీ చేసేందుకు సిద్ధంగాలేమని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలే నేరుగా కేసీఆర్ కు చెప్పినట్లు మాకు సమాచారం ఉంది. నీ​ఫొటోతో వెళ్తే జనాలు కొట్టేలా ఉన్నారని వారు కేసీఆర్ తో అన్నట్లు తెలిసింది” అని సంజయ్​ పేర్కొన్నారు.  కేసీఆర్ పని అయిపోయిందని, ప్రజలతో పాటు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను నమ్మే పరిస్థితిలో  లేరన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్,  కిసాన్ మోర్చా స్టేట్​ ప్రెసిడెంట్​ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. 

రాజగోపాల్ రెడ్డితో వివేక్ మాట్లాడుతున్నరు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయంపై ఆయనతో తమ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. రాజ్​గోపాల్​రెడ్డితోపాటు చాలా మందిని బీజేపీలోకి తీసుకువచ్చేందుకు వివేక్​ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ‘‘రాజగోపాల్ రెడ్డి చేరికపై నేను, వివేక్ మాట్లాడుకున్నం. బీజేపీలో చేరుతానని మాతో రాజగోపాల్​ అన్నారు” అని సంజయ్​ పేర్కొన్నారు.