Dhurandhar Box Office: బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్'గర్జన .. రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్లర్!

Dhurandhar Box Office: బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్'గర్జన .. రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్లర్!

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ తన కెరీర్ లో అత్యంత భారీ విజయాన్ని  ఖాతాలో వేసుకున్నారు.. ఆయన నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్ల సునామీనే కాదు, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం ప్రతిష్టాత్మకమైన రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో రణ్‌వీర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

కలెక్షన్ల ప్రవాహం

భారతీయ సినిమా గర్వించదగ్గ మైలురాయిని 'ధురంధర్' చేరుకుందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్ల (గ్రాస్) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై తొలి నుంచి పాజిటివ్ టాక్ తో రికార్డులు సృష్టిస్తూ..  ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ భారీ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ 9వ స్థానానికి చేరుకోవడమే కాకుండా, రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ రికార్డులను సైతం తుడిచిపెట్టేసింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 789.18 కోట్ల గ్రాస్ (రూ. 633.5 కోట్ల నెట్) వసూలు చేయగా, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 217.5 కోట్ల మార్కును దాటి సత్తా చాటుతోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

 

యదార్థ సంఘటనల ఆధారంగా....

‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని అందించిన ఆదిత్య ధర్.. ఈ మూవీ అద్భుతమైన దేశభక్తి, హై-వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందించారు. 1994-2000 మధ్య జరిగిన భారత నిఘా సంస్థల ఆపరేషన్లు, ముఖ్యంగా 1999 కాందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి వెనుక ఉన్న వాస్తవ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు తోడు, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ వంటి దిగ్గజ నటుల నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

ALSO READ :  సినీ ప్రస్థానానికి వీడ్కోలు

సీక్వెల్ అప్‌డేట్..

మొదటి భాగం కేవలం హిందీలోనే ఈ రేంజ్ సంచలనం సృష్టించగా, మేకర్స్ ఇప్పుడు సెకండ్ పార్ట్‌పై భారీ ప్లాన్స్ వేస్తున్నారు. ‘ధురంధర్ 2’ వచ్చే ఏడాది మార్చి 19న ఈద్ కానుకగా విడుదల కానుంది. ఈసారి సినిమాను కేవలం హిందీకే పరిమితం చేయకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయబోతున్నారు. రెండో భాగంలో మరిన్ని యదార్థ ఆపరేషన్లను చూపించబోతున్నట్లు సమాచారం. ఒకవైపు రణ్‌వీర్ సింగ్ మ్యాజిక్, మరోవైపు ఆదిత్య ధర్ మేకింగ్ వాల్యూస్ వెరసి 'ధురంధర్' భారతీయ స్పై థ్రిల్లర్లకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది...