
- అడ్డిమారి గుడ్డి దెబ్బకాదు.. నాలుగు సీట్లు గురిపెట్టి కొట్టినం: కె.లక్ష్మణ్
- ఇలాంటి దెబ్బలు ఇంకెన్నో తగుల్తయ్
- నియంతృత్వం, అహంకారం, అరాచకం వల్లే మీరు ఓడారు
- రైతు సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా
- కేసీఆర్, కేటీఆర్ లపై బీజేపీ స్టేట్చీఫ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రంలో రైతు సమన్వయం లేదు, సంక్షేమం లేదు. సంక్షేమం ఎక్కడైనా ఉందంటే అది కేవలం సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లోనే” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలా బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘మీ అసమర్థత మీద గురి చూసి దెబ్బ కొట్టి నాలుగు సీట్లు గెలుచుకున్నాం. ఇంకా మూడు, నాలుగు సీట్లు వచ్చే ఉండేవి. టీఆర్ఎస్ కు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. ఈ నాలుగు సీట్లు.. మోడీ, అమిత్ షా వేసిన దెబ్బలు. ఇలాంటి దెబ్బలు ఇక తగులుతూనే ఉంటాయి. కాచుకో కేటీఆర్’’ అని హెచ్చరించారు. మీతిమీరిన ఆత్మ విశ్వాసంతోనే సీట్లు తగ్గాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మితిమీరిన ఆత్మవిశ్వాసం మాత్రమే కాదని, మీతిమీరిన అహంకారం, అరాచకం, అవినీతి, రాచరికం, అధికారమదం, వారసత్వం, కుటుంబ పాలన అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శనివారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. దీనికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్రం ఎరువులు ఇస్తామంటే తీసుకోలే
‘‘కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎరువులు కావాలంటే అన్ని ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అయినా తీసుకోని అసమర్థ ప్రభుత్వమిది. తీసుకున్న కొన్ని ఎరువులను కూడా అమ్మేసుకున్న అవినీతి సర్కార్ ఇది” అని లక్ష్మణ్ ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు పెట్టి ముందుగానే పెట్టుబడి సాయం ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు వ్యవసాయ సీజన్ ముగుస్తున్నా పెట్టుబడి ఇవ్వడం లేదని ఆరోపించారు. పెట్టుబడి సాయం ఇంకా సగం మందికి అందలేదని, బ్యాంకులకు వెళ్తే డబ్బులు లేవని అంటున్నారని అన్నారు. ఎరువులు కొనేందుకు కూడా ఈ పెట్టుబడి సాయం సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వ తీరు కారణంగా బ్యాంకులు రైతులకు అప్పులు ఇవ్వడం లేదని విమర్శించారు. ‘‘గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కోసం రైతులు పాసు పుస్తకాలు, చెప్పులు క్యూలో పెడితే కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన సర్కార్ లో కూడా నిత్యం ఇదే పరిస్థితిని చూస్తున్నాం. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెప్తరు” అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేటీఆర్ అమెరికాలో ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే, కేసీఆర్ ఇంకా ఉద్యమం గురించి ఆలోచించని రోజుల్లోనే తామిక్కడ తెలంగాణ గురించి స్వప్నించామని అన్నారు. తమ పార్టీ సమావేశాలు జరిగిన కాకినాడలో ‘ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు’ అని నినదించామని చెప్పారు.
ఆ పార్టీలో ఇంకెవ్వరూ ఎదగరు, ఎదగనివ్వరు
‘‘టీఆర్ఎస్ అందరి పార్టీ అని కేటీఆర్ అంటున్నారు. హిందువులను కించపరిచే పార్టీ అందరిది ఎట్లయితది. అది కొందరి పార్టీయే. కొన్ని వర్గాలను మాత్రమే అక్కున చేర్చుకునే పార్టీ. కేవలం కల్వకుంట్ల కులం, మతం, వర్ణం, వర్గానికి చెందిన పార్టీ” అని లక్ష్మణ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో ఇంకెవ్వరూ ఎదగరని, ఎదగనివ్వరని, కనిపించరని ఆరోపించారు. కరీంనగర్ లో బీజేపీని ఎదుర్కొనేందుకు మాత్రమే నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని, కేటీఆర్ అంటున్నట్లు ఆ జిల్లాపై ప్రేమ ఉండి కాదన్నారు. ప్రేమ ఉంటే మొదటి ప్రభుత్వంలో ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కేబినెట్లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండాలని, అన్ని జిల్లాలకు సమన్యాయం చేయాలని, ఒక్క జిల్లాపైనే ప్రేమ అంటే ఎలా అని ప్రశ్నించారు.