
భారత దేశంలో కులం, మతం, స్థానికం అనే ఎలాంటి భేదం లేకుండా దేశానికి సేవలందించే ఒకే ఒక్క సంస్థ డిఫెన్స్
( ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్). భర్తీ సమయంలో, సర్వీస్ మొత్తంలో కూడా ఎక్కడా ప్రమోషన్ లాంటి విషయాల్లో కూడా ఎలాంటి కుల, మత, స్థానికం ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఉండవు. కానీ, పదవీవిరమణ తర్వాత రాష్ట్రాల్లో మాజీ సైనికుల పిల్లలకు మాత్రం కుల, మత, స్థానికత ప్రాతిపదికన ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోంది.
నిజాం కాలం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం వరకు ముల్కీ నాన్ ముల్కీ, సిక్స్ పాయింట్ ఫార్ములా, నీళ్ళు నిధులు నియామకాలు అనే నినాదాలతో 29 వ రాష్ట్రంగా ఏర్పడ్డ న్యూ బోర్న్ స్టేట్ తెలంగాణలో మాజీ సైనికుల పిల్లలకు స్థానికత విషయంలో జరుగుతున్న అన్యాయం పాలకులకు పట్టకపోవడం చూస్తే, సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల పట్ల ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. దేశరక్షణలో సుమారు లక్ష మంది తెలంగాణ తాజా మాజీ సైనికులు పాలుపంచుకుంటున్నారు.
తెలంగాణలో పది జిల్లాలు 33 జిల్లాలుగా ఏర్పడిన తర్వాత, ఉద్యోగాల స్థానికత విషయంలో రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ 29.08.2018 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం G.O.Ms.No.124 Dt: 30.08.2018 లో ఉద్యోగం పొందాలంటే స్థానికత విషయంలో ఒకటి నుంచి ఏడు అకాడమీ సంవత్సరాల్లో కనీసం నాలుగు సంవత్సరాలు స్థానికంగా చదివి ఉండాలనే నిబంధన చేర్చింది. ఈ నిబంధనే సైనికుల పిల్లలకు పెద్ద శాపంగా మారింది. విధి నిర్వహణలో భాగంగా సైనికులు తమ భార్య పిల్లలతో దేశ వ్యాప్తంగా నాలుగు దిక్కులలో ప్రతీ మూడేళ్లకోసారి ట్రాన్స్ఫర్ అవుతారు. అందువల్ల పిల్లలు ఒకే ప్రదేశంలో చదివే అవకాశం ఉండదు.
ఒక ఉదాహరణ
ఈ నిబంధనల వలన సైనికుల పిల్లలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఉదాహరణకు, నల్గొండ జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ గుత్తా నరసింహ రెడ్డి ఎయిర్ఫోర్స్ లో పదహారు సంవత్సరాలు సేవలు అందించి పదవీ విరమణ పొందాడు. తెలంగాణ వైద్య వృత్తిలో తన కూతురు ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పాస్ అయినా స్థానికంగా చదవలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేమని ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయంపై పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారు. దేశానికి సేవ చేయడమే తమ పిల్లల భవిష్యత్తుకు అడ్డంకిగా మారిందని వాపోతున్నారు. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు.
పరిష్కారం
ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ తదితర పోటీ పరీక్షల్లో సైనికుల పిల్లల అర్హత కోసం ఇదే స్థానికత విషయంలో తల్లిదండ్రులు (సైనికులు) భర్తీ సమయంలో ఉన్న స్థానికత ఆధారంగా వారి పిల్లలకు CAP (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్) సర్టిఫికెట్ అర్హతగా నిర్ణయించారు. పోటీ పరీక్షల కోసం ఇలాంటి వెసులుబాటు ఉంది. కానీ పోటీ పరీక్షలలో అర్హత పొందిన తర్వాత ఉద్యోగం పొందడానికి మాత్రం ఈ సర్టిఫికెట్ వర్తించదు.
దేశం కోసం ప్రాణాలు లెక్కచేయకుండా బార్డర్ లో పోరాడుతున్న సైనికులు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి ఉత్తర్వులు, జీవోలను సవరించడం ఒక పరిష్కారం ఐతే, వీటిని మార్చకుండా మధ్యేమార్గంగా పోటీ పరీక్షలలో అర్హత కోసం వెసులుబాటు ఇచ్చే CAP ( Children of Armed force Personnel ) ఉద్యోగాలలో కూడా వెసులుబాటు ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. చివరిగా బార్డర్లో సైనికుల ఆత్మస్థైర్యం దృఢంగా ఉండాలన్నా ప్రతిభగల యువకులు సైన్యంలో చేరడానికి ఆసక్తి కనబరచాలన్న రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా మాజీ సైనికులకు తగిన పునరావాసం, వారి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి.
- బందెల
సురేందర్ రెడ్డి,
అధ్యక్షుడు, సిద్ధిపేట జిల్లా
ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్