- ఏడాదిపాటు కూడా సేవలందించని వైనం
- ఎండోమెంట్ శాఖలులో పనులన్నీ పెండింగ్
- ప్రమోషన్లు, బదిలీల్లో భారీగా అక్రమా
- ఆలయ భూములు కబ్జా చేస్తున్న సొంత శాఖ ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేదా డైరెక్టర్‌ను కేటాయించకపోవడంతో ఆలయాల్లో అభివృద్ధి పనులు, భక్తులకు సౌలత్లు కల్పించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగ్‌ల విషయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శాఖాపరమైన కీలక ఫైల్స్ పెండింగ్‌లో ఉంటున్నాయనే వాదనలున్నాయి.
విధానపరమైన నిర్ణయాలతో పాటు టెండర్లు, కొనుగోళ్లు, కొత్త ప్రాజెక్టుల ఆమోదం, అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇది ఆలయాల ఆదాయంతో పాటు భక్తులకు సౌకర్యాల కల్పనలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. ముఖ్యంగా విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా.. పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. కంచె చేను మేసినట్లుగా సొంతశాఖ ఉద్యోగులే ఆలయ భూములను ఆక్రమించుకుంటున్నా.. చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
ఇక ఉద్యోగులు, సిబ్బంది తీరుపై అనేక విమర్శలున్నాయి. ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. సమయపాలన పాటించకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యాలు కల్పించడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినా.. కనీసం పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ టికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నరు
ఆలయ దర్శన టికెట్లు, ప్రసాదాల తయారీపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో నకిలీ టికెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారని, ప్రసాదాల తయారీలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలూ ఉన్నాయి. ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనరేట్‌లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగుల్లో క్రమశిక్షణ లోపించింది. సమయపాలన పాటించడం లేదని, కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ వేసుకుని తమ సొంత పనుల కోసం బయటకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎవరొచ్చినా ఏడాదిలోపే..
దేవాదాయ శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ఇక్కడి కమిషనర్‌గా కానీ, డైరెక్టర్‌గానీ ఎవరొచ్చినా పట్టుమని ఏడాది కూడా కొనసాగడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత దేవాదాయశాఖ కమిషనర్ పోస్టు ఏపీకి కేటాయించారు. తెలంగాణకు కమిషనర్ పోస్ట్ లేకపోవడంతో వేరే శాఖలో పూర్తిస్థాయి బాధ్యతలు చేపడుతున్న ఐఏఎస్ ఆఫీసర్లకు ఎండోమెంట్లో ఇన్చార్జ్ కమిషనర్ లేదా డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కొనసాగిస్తూ వచ్చారు.
గడిచిన 22 నెలల్లో ముగ్గురు కమిషనర్లతో పాటు ముగ్గురు డైరెక్టర్లు మారారు. పూర్తిస్థాయి ఆఫీసర్‌ను నియమించకపోవడంతో దేవాదాయశాఖలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఉద్యోగులు చెప్తున్నారు. డైరెక్టర్‌గా నియమించినా.. వారికి అదనపు బాధ్యతల కింద ఈ శాఖను అప్పగిస్తున్నారు. అంతేగానీ, పూర్తిస్థాయి బాధ్యతలు కేటాయించడం లేదు.
2017లో అనిల్‌కుమార్‌ను దేవాదాయశాఖ కమిషనర్ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. 2019లో పదవి విరమణ పొందారు. ఈ క్రమంలో నీత్ప్రసాద్ను కమిషనర్‌గా నియమించారు. ఆమె ఒకరోజు వెళ్లి చార్జ్ తీసుకుని తర్వాత రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం అనిల్ పదవిను పొడిగించడంతో మళ్లీ కమిషనర్‌గా నియామకం అయ్యారు. ఆయన 2024 వరకు కొనసాగారు. ఈయన ఒక్కరే సుదీర్ఘ కాలం పనిచేశారు.
45 ఏండ్లు నిండినోళ్లే కమిషనర్ లేదా డైరెక్టర్
2024, ఏప్రిల్ లో హనుమంతరావు దేవాదాయశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 7 నెలలు పనిచేశాక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో హనుమంతు కొడింబాను డైరెక్టర్‌గా నియమించారు. అయితే, దేవాదాయశాఖ మార్గదర్శకాల్లో 45 ఏండ్లు నిండినవారే కమిషనర్ లేదా డైరెక్టర్ గా నియమించాలని ఉండటంతో నెలరోజులు కాకముందే ఆయన్ను మార్చారు.
2024, నవంబర్‌లో శ్రీధర్‌ను కమిషనర్‌గా నియమించగా.. కేవలం 5 నెలలే కొనసాగారు. ఆ తర్వాత వెంకటరావును నియమించారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈయనకు అదనంగా యాదగిరిగుట్ట ఈవో బాధ్యతలు అప్పగించారు. అయితే, ఈయన పదవి కాలంకూడా పూర్తి కావడంతో ఈ పోస్ట్ ఖాళీ అయ్యింది.
ఆ తర్వాత గత సెప్టెంబర్‌లో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్న శైలజరామయ్యర్కు ఇన్చార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత జౌళి, దేవాదాయ శాఖలతో పనిభారం పెరగడంతో తాజాగా జెన్కో సీఎండీగా కొనసాగుతున్న హరీశ్‌కు దేవాదాయశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇష్టారాజ్యంగా బదిలీలు
ఇప్పుడైనా డైరెక్టర్ పూర్తిస్థాయిలో కొనసాగుతారా? లేక మధ్యలోనే ట్రాన్స్ఫర్ చేస్తారా? అనేది దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ లేదా డైరెక్టర్ లేకపోవడంతో ఆ తర్వాత బాధ్యతలు చూసే అడిషనల్ కమిషనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బదిలీ లు, పోస్టింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చేయి తడపనిదే ఏ ఫైల్ ముందు సాగదనే అపవాదు ఉంది. ఆ ఆఫీసర్లను ప్రసన్నం చేసుకుంటేనే అనుకున్నచోట పోస్టింగ్ ఇస్తారని లేదంటే.. శంకర్‌గిరి మాన్యాలు తప్పవనే ఆ శాఖ ఉద్యోగులే చెప్తుండటం విశేషం.. ఇటీవల దక్షిణ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రానికి ఇన్చార్జ్ ఈవో కొనసాగుతున్న వారిని.. సడెన్‌గా ఉత్తర తెలంగాణలో ప్రముఖ ఆలయానికి బదిలీ చేయడం చర్చానీయాంశంగా మారింది. అయితే, ఈ ఆలయానికి డీసీ కేడర్‌ను ఉన్నవారని కేటాయించాల్సి ఉండగా.. ఏసీ కేడర్ వారిని కేటాయించడం విశేషం.
