బస్సు ట్రావెల్ మాఫియాపై చర్యలు లేకనే..!

బస్సు ట్రావెల్ మాఫియాపై  చర్యలు లేకనే..!

కావేరి వోల్వో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత  అసలు ఇలాంటి ప్రమాదాలకు ప్రధానంగా కారకులు ఎవరు? ఈమధ్య నేను దైవదర్శనం కోసం నా బైక్ మీద సిటీ ఔట్‌‌‌‌‌‌‌‌స్కర్ట్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఒక ఆలయానికి వెళ్లాను.  ఆ మార్గంలో పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ వారు టూ వీలర్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

 ఆ సమయంలో వారు అడిగిన డాక్యుమెంట్స్ వారికి చూపించాను. తరువాత వారు ‘మీ బండికి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా’ అని అడిగాడు.  కానీ, నా బండికి పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు కొద్దిరోజుల ముందే ముగిసింది.  నేను దానిని గమనించుకోలేదు. నేను అదే విషయం వారికి చెప్పాను. 

 ‘మీరు వెంటనే బండికి పొల్యూషన్ పరీక్ష చేయించుకుని, అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయించుకోవాలి. ఇప్పుడు మాత్రం మీ బండి మీద మేం ఫైన్ వేస్తున్నాం’ అని చెప్పారు.  ఇక్కడ వారిని తప్పు పట్టలేం. వారి ఉద్యోగాన్ని వారు సక్రమంగానే చేశారు. 

ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, సామాన్య ప్రజలకి, వారి వాహనాలకు హెల్మెట్ లేకపోతేనో,  ఒక పత్రం లేకపోతేనో వారి వాహనాలను ఆపి వారికి ఫైన్ వేస్తున్న పోలీస్ వ్యవస్థ, రవాణా శాఖ వ్యవస్థ!  తెలుగు రాష్ట్రాల్లో తిరిగే ప్రైవేట్ బస్సుల ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై, బస్సు పత్రాల తనిఖీలు చేయడంలో ఇదే మాదిరిగా ఎందుకు పని చేయడం లేదు అనేది నా ప్రశ్న?

బస్​ ట్రావెల్ మాఫియాను నియంత్రించాలి

ఎందుకు ఈ బస్ ట్రావెల్ మాఫియా మీద ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకి ఇంత ప్రేమ? నాకు ఈ మాట నిన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత, ఆ బస్సులో సజీవంగా కాలి బూడిదైనవారి ఫొటోలు చూశాక నాకు అడగాలనిపించింది.  ఇలాంటి  మాఫియాలను అరికట్టకపోతే ప్రభుత్వాలకి,  ప్రభుత్వ అధికారులకి బాధితుల ఉసురు తగులుతుంది!  

కొన్ని రోజుల క్రితం నేను అమెరికాలో యాక్సిడెంట్ జరిగిన సంఘటన వార్తని చదివాను. ఒక భారతీయ పౌరుడు ఒక పెద్ద వాహనాన్ని నడుపుతూ రాంగ్ వేలో టర్న్ చేశాడు. దాని కారణంగా అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ సంఘటన ఆధారంగా అమెరికా ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. దానిలో తేలిన కొన్ని నిజాల నివేదిక ఆధారంగా అమెరికా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి, ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చింది. దాని వివరాలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయి.

శాశ్వత పరిష్కారం చేపట్టాలి

మన దేశంలో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు ఎక్కడో ఒకచోట  ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు సంతాపాలు తెలిపి ఆ సంఘటనను మర్చిపోతారు. 2013 సంవత్సరంలో అనుకుంటా, ఇలాంటి సంఘటననే జబ్బార్ ట్రావెల్స్‌‌‌‌‌‌‌‌లో కూడా జరిగింది. అప్పుడు ఆ ప్రమాదంలో 49 మంది బస్సులో సజీవ దహనం అయ్యారు. 

ఆ సమయంలో బాధితుల పక్షాన, ఓయూ జేఏసీ, జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ జేఏసీల నుంచి మేం  బాధితుల పక్షాన పోరాటం చేశాం.  దాని మీద చాలా చర్చలు జరిగాయి. కొన్ని మార్పులు, చేర్పులు చేస్తామని అప్పటిప్రభుత్వం తూతూమంత్రంగా మొదలుపెట్టి దాన్ని మధ్యలోనే ఆపేశారు.  

ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కానీ, ప్రభుత్వాలు తూతూమంత్రంగా ఆ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేసి, ఆ సంఘటనని మర్చిపోతున్నారు. శాశ్వత పరిష్కారం మాత్రం కనుగొనడం లేదు. 


- సురేందర్​ తాళ్లపల్లి-