బంగాళాఖాతంలోని తుఫాన్ మోంథా.. తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. అక్టోబర్ 28వ తేదీ.. అంటే మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. జల ప్రళయంగా తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ మోంథా.. 28వ తేదీ సాయంత్రం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. ప్రస్తుతం గంటకు 15 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ కేంద్రం.. విశాఖపట్నం సిటీకి 700 కిలోమీటర్లు.. కాకినాడకు 650 కిలోమీటర్లు.. చెన్నై సిటీకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను 2025, అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో కదిలిన మోంతా ప్రస్తుతానికి చెన్నైకి 600కి.మీ, విశాఖపట్నంకి 710 కి.మీ, కాకినాడకి 680 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఏండీ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి మోంతా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో దాటే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ.
తుఫాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. లైలా, ఫైలిన్, హుద్-హుద్, తిత్లీ ఇతర తుఫానుల సమయంలో గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా పైడిభీమవరం, ఇచ్ఛాపురం నుంచి 185 కి.మీ. పొడవైన సముద్ర తీరం ఉన్న శ్రీకాకుళం జిల్లాపై తుఫాను ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ మేరకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. తీరం వెంబడి వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండొద్దని అధికారులను హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటనుండటంతో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని.. బయటకు రావొద్దని అప్రమత్తం చేసింది. తుఫాన్ ప్రభావంతో సోమవారం (అక్టోబర్ 27) కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.
