- యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో రీసెర్చర్ల స్టడీలో వెల్లడి
ఓస్లో(నార్వే): మనుషులు వృద్ధాప్యంలోకి చేరుకున్నప్పుడు వారి మెదడు క్రమంగా క్షీణిస్తుంది. మెదడులోని వివిధ భాగాల్లో కణజాలం నశించిపోతూ బూడిద, తెలుపు రంగు పదార్థం తగ్గిపోతుంటుంది. దీంతో అల్జీమర్స్, డిమెన్షియా వంటి మెదడు సంబంధ సమ్యలు పెరుగుతుంటాయి. అయితే, ఆడవాళ్ల కంటే మగవాళ్లలోనే ఈ మెదడు క్షీణత వేగంగా జరుగుతోందని నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో రీసెర్చర్ల స్టడీలో వెల్లడైంది.
రీసెర్చ్ లో భాగంగా మెదడు ఆరోగ్యంగా ఉన్న 17 నుంచి 95 ఏండ్ల మధ్య వయసుల్లోని 4,726 మంది వాలంటీర్లపై స్టడీ నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ మూడేండ్ల గ్యాప్ తో రెండు సార్లు ఎంఆర్ఐ స్కాన్ లు చేయించారు. మొత్తం 12 వేల బ్రెయిన్ స్కాన్ లు తీసి వాటన్నింటినీ విశ్లేషించారు. దీంతో వృద్ధాప్యంలో మెదడు క్షీణతపై లింగ ప్రభావం కూడా ఉన్నట్టు తేలిందని, ఆడవాళ్ల కంటే మగవాళ్ల మెదడులోనే కణజాలం వేగంగా క్షీణిస్తోందని వెల్లడైందని యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ ఆన్నే రవాండల్ తెలిపారు.
‘‘సాధారణంగా వృద్ధాప్యంలో వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల బ్రెయిన్ వేగంగా క్షీణిస్తుంది. అల్జీమర్స్ వ్యాధితో మరణించినవాళ్లలోనూ మెదడు క్షీణత గణనీయంగా ఉంటున్నట్టు పరిశోధనల్లో తేలింది. కానీ పురుషులతో పోలిస్తే మహిళల్లోనే మెదడు క్షీణత తక్కువగా ఉన్నప్పటికీ, అల్జీమర్స్ కేసులు మాత్రం రెట్టింపుగా నమోదుకావడం ఆశ్చర్యకరంగా మారింది.
అయితే, మనుషుల మెదడు క్షీణతపై లింగ ప్రభావం ఉంటుందన్న దానిపై ఇప్పటివరకూ ఎక్కువగా సమాచారం లేదు” అని రవాండల్ వెల్లడించారు. వయసు పెరుగుతున్నకొద్దీ మహిళల మెదడులో కొన్ని భాగాల్లో మాత్రమే కణజాలం క్షీణిస్తోందని, కార్టెక్స్ భాగం మందం కూడా స్వల్పంగానే తగ్గిపోయిందని గుర్తించామన్నారు. అయితే, మెదడు క్షీణతపై లింగ ప్రభావం అంశంపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘పీఎన్ఏఎస్’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.
