మావోయిస్టులు వరుసగా చంపబడుతుండటం, ప్రభుత్వానికి సరెండర్ అవుతుండటంతో ఆ ఉద్యమం ఇక బతుకుతుందా అని చర్చ జరుగుతోంది. చాలాకాలం కిందనే ఈ దేశంలో మావోయిజం ఆధారంగా జరిగే విప్లవ పోరాటం క్యాడర్‌తో నిండిన రైలుబండి కొండకు గుద్దుకుని దెబ్బతింటుంది అని రాశాను. నేను అది రాసింది ఆ పార్టీ వరంగల్ రైతుకూలీ పెద్ద సభనొకటి వరంగల్‌లో పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని చేపడతామని ఒక డాక్యుమెంటును రిలీజ్ చేసిన తరువాత. ఎందుకు నేను ఆనాడు అలా రాశాను.
1980 నుంచి 1996 వరకు నేను ప్రజాస్వామ్య, పౌరహక్కుల ఉద్యమంలో పనిచేశాను. 1980 నుంచి 86 చివరివరకు ఆ హయాంలో నాగిరెడ్డి గ్రూపుతో లోతుగా రాజకీయంగా కూడా పనిచేశాను. అప్పటికే దేశంలో నాగిరెడ్డి గ్రూపు, చండ్ర పుల్లారెడ్డి గ్రూపు, చారుమజుందార్ గ్రూపులుగా వాళ్లంతా విడిపోయి ఉన్నారు. అయితే నేను నాగిరెడ్డి గ్రూపును ఎందుకు ఎన్నుకున్నాను అంటే..పైన పేర్కొన్న ముగ్గురు నాయకుల్లో నాగిరెడ్డి ఒక్కడే నాకు శక్తిమంతమైన మేధావిగా కనిపించాడు.
ఆయన పేరుతో బయటకు వచ్చిన తాకట్టులో భారతదేశం పుస్తకాన్ని నేను ఇంగ్లిష్‌లో చదివాను. దాన్ని ఆయన ఇంగ్లిష్‌లో రాసి కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్. అదొక్కటే ఆ లైన్ సిద్ధాంతాన్ని మార్క్స్, లెనిన్, మావోల సిద్ధాంతాన్ని కొంతైనా రంగరించి రాసిన నాకు దొరికిన పుస్తకం. మిగతా లీడర్లు ఎవరూ ఈనాటికీ వారి సిద్ధాంతాలను బలంగా వివరిస్తూ ఒక పుస్తకం రాయలేదు.
అయితే పుల్లారెడ్డి, చారుమజుందార్ అనుచరులు తుపాకులు, దళాలు, వర్గం, శత్రు నిర్మూలన ఆచరణలో బాగా పలుకుబడిలో ఉన్న రోజులవి. అందరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని బద్దలుకొట్టి ఓటుతో రాసుకున్న ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి నూతన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని, కార్మికవర్గ నియంతృత్వాన్ని స్థాపించుకుని కలలు కంటున్నవారే.
నాగిరెడ్డి దానికి కాస్త కన్విన్స్ చేయగలిగే సిద్ధాంత స్టేటుమెంటు ఆ పుస్తకంలో చేశారు. నేను కూడా నా చుట్టూ భూస్వామ్య వ్యవస్థ పట్ల ద్వేషంతో ఉన్నాను. కనుక సిద్ధాంత రచనలు చదివే పిచ్చి ఉంది కనుక దానిలో చేరాను.
హక్కుల రంగంలో పనిచేశాను. అయితే, 1985లో కారంచేడు ఎలీషమ్మ నా కండ్లు తెరిపించింది. ఆమె మాదిగ క్రైస్తవ స్త్రీ. అంబేద్కర్ రాజ్యాంగం హక్కును ఆసరా చేసుకుని కారంచేడు చెరువులో బర్రెను కడిగింది. అక్కడి కమ్మ భూస్వాములు మొత్తం మాదిగ పల్లెను ధ్వంసం చేసి 8 మందిని తరిమి చంపారు. అప్పుడు దళిత మహాసభ, ఏ సంస్థతో సంబంధంలేని దళితులు అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని రోడ్లమీదకు తెచ్చారు. అప్పుడుగాని అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని ఉనికిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని మరో కోణంలో అధ్యయనం చేసే అవసరం నాకు రాలేదు.
అంబేద్కర్ మీద రాజ్యాంగం మీద కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. హత్యకు, అవమానాలకు, అంటరానితనానికి, అతి పేదరికానికి గురవుతున్న దళితులే రాజ్యాంగాన్ని నమ్ముతుంటే విప్లవకారులు దాన్ని బద్దలు కొడతామని, అంబేద్కర్ బూర్జువా మేధావి అని మాట్లాడటం నన్ను కలవరపరిచింది. నేను ఆ మార్గం వదిలేశాను. నాగిరెడ్డి గ్రూపు కూడా ఆయుధ సమీకరణ, వర్గ శత్రు నిర్మూలన, దళ నిర్మాణం చేయలేదు కనుక క్రమంగా కనుమరుగైంది.
జాడ తెలియని గణపతి
పుల్లారెడ్డి గ్రూపు ఒకవైపు, చారుమజుందార్ వారసులుగా కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి గ్రూపులు చాలా పోరాటాలు చేశాయి. ఎన్‌కౌంటర్‌కు గురయ్యాయి. కొంతమంది భూస్వాములను, పోలీసులను చంపాయి. ఇదంతా ఈ రాజ్యాంగాన్ని బద్దలుకొట్టి నూతన ప్రజాస్వామిక రాజ్యాంగం, ఆ తరువాత సోషలిస్ట్ శ్రామికవర్గం నియంతృత్వం స్థాపించేందుకు. క్రమంగా పుల్లారెడ్డి గ్రూపు బలహీనపడింది.
ఇక ఇప్పుడు చారుమజుందార్ గ్రూపుగా మొదలైన గ్రూపు క్రమక్రమంగా ఆర్ఎస్ఎస్/ బీజేపీ ప్రభుత్వపు అణచివేత, ఎత్తుగడలతో కనుమరుగు అయ్యే దశకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మావోయిస్టు బ్రాహ్మణ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు చేతిలో అంబేద్కర్ రాజ్యాంగం పెట్టి లొంగించి మొత్తం దేశానికి చూపించాడు.
అలాగే చత్తీస్‌గఢ్‌లో 200 మందికి పైగా ఆశన్న నేతృత్వంలో బ్లూ కలర్ రాజ్యాంగాన్ని పట్టుకుని లొంగిపోయారు. ఇక చాలామంది అగ్రనాయకులు చంపబడ్డారు. గణపతి జాడ తెలియదు. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు నెహ్రూ, సర్దార్ పటేల్ నేతృత్వంలో దానికి కానిస్టిట్యుయెంట్అసెంబ్లీలో అంగీకారం దొరికినప్పుడు రెండు సిద్ధాంత గ్రూపులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.
1. ఆర్ఎస్ఎస్ గ్రూపు. 2. కమ్యూనిస్ట్ గ్రూపు. ఆర్ఎస్ఎస్ ఇది మనుధర్మానికి వ్యతిరేక విదేశీ రాజ్యాంగం, అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్అన్నారు. ఆనాడు ఆ రెండు వర్గాల నాయకులు బ్రాహ్మణులే. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎంఎన్ రాయ్‌తో స్టార్ట్ అయితే, ఆర్ఎస్ఎస్ హెగ్డేవార్‌తో స్టార్ట్అయింది.
పునాదిగా కులవ్యవస్థ
గత వందేండ్లలో ఈ సిద్ధాంతాలు ఎక్కడికి చేరుకున్నాయి? ఈ రాజ్యాంగాన్ని మరో ఎత్తుగడతో కూలగొట్టాలనుకున్న ఆర్ఎస్ఎస్ ఎమర్జెన్సీ, ఆ తరువాత మండల్ మూమెంట్ క్రమాలలో మారుకుంటూ 1999 నాటికి ఢిల్లీలో రాజకీయ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కులాన్ని గుర్తిస్తున్నాం.
ఓబీసీని ప్రధానిని చేశాం అంటూ క్రమంగా ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకునే హిందూత్వ రాజ్యం స్థాపించే ఆలోచన లోతుగానే చేస్తుంది. అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని అంగీకరిస్తున్నామని మాత్రం పదేపదే చెబుతుంది. బయట పెట్టుబడిదారీ దేశాలతో సంపూర్ణ సంబంధాలు నెలకొల్పుకుంటుంది.
కానీ, మొత్తం కమ్యూనిస్టు పక్షం కుల వ్యవస్థ పునాదిగా వేల ఏండ్లు ఉన్న ఈ దేశాన్ని మార్క్సిజంలోకి ఎలా మార్చాలో, అంబేద్కర్‌ను, ఈ రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, ఆ సిద్ధాంతాన్ని ఫూలే, అంబేద్కర్, పెరియార్ రచనలు, ఆచరణ వెలుగులో అధ్యయనం చేయగలిగే మేధావులను కూడా సృష్టించలేక అన్ని పార్టీలు, గ్రూపులు క్రమక్రమంగా మూతబడుతున్నాయి. అందులో మావోయిస్టులు పనిచేస్తూ వచ్చిన ఈ గ్రూపులు తీవ్రమైన నిర్బంధాన్ని, చావులను ఎదుర్కొని తమ నిర్మాణాలను కోల్పోవడం తప్ప మరో మార్గం లేదు.
‘తాకట్టులో భారతదేశం’!
బ్రాహ్మణిజం ఈ దేశంలో ఆధునిక దశలో అన్ని రాజకీయ సిద్ధాంత నిర్మాణాలకు నాయకత్వం వహించింది. అన్ని రాజకీయ రంగాల కంటే కమ్యూనిస్టు సిద్ధాంత రంగంలో అది అతి ఘోరంగా ఫెయిల్ అయింది. సోషలిస్టు సిద్ధాంతం తూర్పు దేశాల్లో ముందుకుపోతున్నప్పుడు దాన్ని ఇక్కడ భూమిలో నాటిన మొక్కలాగ పెంచలేదు.
బ్రాహ్మణ సిద్ధాంతకర్తల శ్లోక లేదా పొయెటిక్ సాహిత్యంలాగ మార్చుకున్నారు. ఈ మొత్తం కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపుల నుంచి దేశ వాస్తవ స్థితిని సిద్ధాంతీకరించి పదికాలాలపాటు సమాజంపై ప్రభావం పడేసిన ఒక మంచి పుస్తకం రాయలేదు. కట్టలు కట్టలు డాక్యుమెంట్లు రాసుకున్నారు. నిజానికి ఇంతో అంతో గుర్తించదగ్గ పుస్తకం అంటే నాగిరెడ్డి రాసిన ‘ఇండియా మార్టిగేజ్డ్’ మాత్రమే. అదే తెలుగులో ‘తాకట్టులో భారతదేశం’!
ఆర్ఎస్ఎస్ ప్రతికూల శక్తిగా కమ్యూనిస్టులు ఎదగాలి
ఆయుధం చేతిలో ఉన్నప్పుడు సిద్ధాంతాన్ని లెక్క చేయకుండా ఉండడం. అంబేద్కర్‌లాంటి దేశస్థితిని మార్చిన సిద్ధాంతవేత్తను బూర్జువా మేధావి అని కొట్టిపారేయడం చాలా సులభం. కానీ, ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రులు ఆయన రాసిన రాజ్యాంగాన్ని చేతపట్టించి లొంగదీసుకుంటున్నప్పుడు కనీసం అలా లొంగకుండా అడవుల్లోనో, పట్టణాల్లోనో ఉన్నవాళ్లు ఆలోచించి ఈ రాజ్యాంగాన్నే ఉపయోగించి ఏం చేయవచ్చో ఆలోచించాలి కదా!
కొండకు గుద్దుకునే రైల్లోనే ఇంకా కూర్చుంటే ఏమవుతుంది? సీపీఐ, సీపీఎం కూడా క్రమంగా సన్నగిల్లుతున్నాయి. వెస్ట్‌బెంగాల్, త్రిపురలను పరిపాలించినప్పుడు కూడా వాళ్లు ఆ సమాజంలో గొప్ప మార్పేమీ తేలేదు. కేరళ భిన్నమైంది. అయితే, ఈ రెండు పార్టీలకు ఆస్తులు దేశంలో ఉన్నాయి. మావోయిస్టులు లేదా ఎంఎల్ గ్రూపులుగా ఉన్నవారికి అవిలేవు.
అంతర్యుద్ధాలు మానేసి కమ్యూనిస్టుగానైనా..
చనిపోగా మిగిలినవారు, లొంగిపోయినవారు ఆ తరువాత ఎలా బతకాలో, ఏం చేయాలో తెలియడం లేదు. ఈ నాయకులు, కార్యకర్తలు బౌద్ధ భిక్షువులలాగో, ఆర్ఎస్ఎస్ సంచాలకులలాగో పెళ్లిళ్లు చేసుకోకుండా, పిల్లలను కనకుండా ఉండలేదు. పెళ్లి చేసుకున్నారు.
పిల్లలను కన్నారు. ఆ పిల్లల పరిస్థితి అయోమయమే. ఇప్పుడున్న కర్తవ్యమల్లా ఆయుధాలు, సిద్ధాంత విభేదాలు అని అంతర్ యుద్ధాలు వదిలేసి ఒక కమ్యూనిస్టు పార్టీగానైనా ఈ రాజ్యాంగ ఎన్నికలను నమ్ముతున్నాం.
ఒక ప్రజాస్వామిక వెల్ఫేర్ పాలన తెస్తామని ప్రజలను నమ్మించవచ్చు. వీరి వెనుక ఉన్న త్యాగాలను, అతి బీద ప్రజలకు 100 సంవత్సరాల్లో కమ్యూనిస్టు ఉద్యమాల వల్ల జరిగిన ప్రయోజనాన్ని చెబుతూ రచనలు చేసి తామే ఆర్ఎస్ఎస్ ప్రతికూల శక్తిగా ఎదగవచ్చు. అట్లయితే సీపీఐ, సీపీఎం చేతిలో ఉన్న ఆస్తులు అందరి కమ్యూనిస్టుల నిర్మాణ ఆస్తులుగా ఉంటాయి. లేకపోతే కాలక్రమేణా ఆర్ఎస్ఎస్/ బీజేపీ ప్రభుత్వాలు వాటిని లాగేసుకుంటాయి.
–కంచ ఐలయ్య షఫర్డ్–
