- 'సోషియాలజీ'లో సెమినార్ నిర్వహించకుండానే మార్కుల కేటాయింపుపై వివాదం
- లైట్ తీసుకుంటున్న వర్సిటీ ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు సెమినార్ నిర్వహించకుండానే మార్కులు కేటాయించడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయం బయటపడి రోజులు గడుస్తున్నా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం, వర్సిటీ పెద్దాఫీసర్లు లైట్ తీసుకుంటుండటం పలు అనుమానాలకు చోటిస్తోంది.
అసలేం జరిగింది.?
కేయూ పీజీ కోర్సుల్లో థర్డ్, ఫోర్త్ సెమిస్టర్లలో థియరీతోపాటు సెమినార్లు కూడా నిర్వహించాల్సి ఉంది. సంబంధిత డిపార్ట్మెంట్లోని విద్యార్థి ఏదైనా ఒక టాపిక్ ఎంచుకుని సెమినార్ లో మాట్లాడాలి. దీనికి 50 మార్కులు కాగా, విద్యార్థుల ప్రతిభను బట్టి మార్కులు వేస్తుంటారు. కానీ, గత మేలో పరీక్షలు నిర్వహించిన అధికారులు సోషియాలజీ డిపార్ట్మెంట్ లో సెమినార్ నిర్వహించకుండానే విద్యార్థులకు మార్కులు వేసేశారు.
కొద్దిరోజుల కింద ఫలితాలు విడుదల కావడంతో విషయం బయటపడింది. కాగా, డిపార్ట్మెంట్ లో చెత్త సాఫ్ చేసిన వాళ్లకు, ఆఫీసర్లకు గిఫ్ట్ లు ఇచ్చిన వారికి అధిక మార్కులు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విషయం బయటకు పొక్కడంతో అదే రోజు సాయంత్రం 5.30 గంటల తర్వాత డిపార్ట్మెంట్ లో సెమినార్ మార్కుల షీట్లను సరి చేసే పనిలో ఉండగా, విద్యార్థి సంఘాల నేతలు వారిని నిలదీశారు.
అనంతరం జరిగిన తప్పిదాలు, ఆఫీసర్ల తీరుపై తగిన ఆధారాలు సేకరించి గత వారమే వర్సిటీ వీసీ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ ఆఫీసర్లు డిపార్ట్మెంట్ హెచ్వోడీతోపాటు మిగతా వారిని మందలించి వదిలేశారు. కానీ, సోషియాలజీ డిపార్ట్మెంట్ లో జరిగిన తతంగంపై విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదు చేసిన మేరకు ఎంక్వైరీ కమిటీ వేసి, తగిన చర్యలు తీసుకుంటామని వర్సిటీ ఆఫీసర్లు హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి విచారణ లేకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా తగిన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కమిటీ వేసి విచారణ జరిపిస్తాం..
సోషియాలజీ డిపార్ట్మెంట్ లో జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే ఎంక్వైరీ కమిటీ వేస్తాం. విచారణ జరిపి, బాధ్యులపై యాక్షన్ తీసుకుంటాం.- కె.ప్రతాప్ రెడ్డి, కేయూ వైస్ ఛాన్స్లర్
