
హైదరాబాద్, వెలుగు: విత్తనోత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, దేశంలోని 60 శాతం విత్తనాలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. బుధవారం బీఆర్కే భవన్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గడుగు గంగాధర్, భవనీ రెడ్డితో కలిసి కోదండ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొక్కజొన్న, వరి, పత్తి విత్తనాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని, ఇక్కడి విత్తనాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రైతు సంక్షేమ పాలన సాగుతోందని, రైతు కమిషన్ ఏర్పాటు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో పంజాబ్‌లో మాత్రమే రైతు, కూలీల కోసం కమిషన్ ఉండగా, తెలంగాణలోను ప్రత్యేక కమిషన్ ఏర్పాటైందని ఆయన వివరించారు.
మల్టీనేషనల్ కంపెనీలతో రైతుల ఒప్పందాలను కట్టడి చేయడానికి త్వరలో విత్తన చట్టం తీసుకొస్తామని, ఈ విషయంలో రైతు కమిషన్, వ్యవసాయ శాఖ కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. గతంలో వైఎస్ హయాంలో పత్తి విత్తన చట్టం తెచ్చినట్టు, ఇప్పుడు కూడా విత్తన చట్టం రూపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలు విత్తన చట్టం తీసుకొచ్చేందుకు అడ్డుపడుతోందని ఆరోపించారు. రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.