
- ఇరుశాఖల అధికారుల మధ్య కుదరని సమన్వయం
- ఉద్యోగుల విలీనంలోనూ సమస్యలు
- స్కీమ్‌లలో తేడాలు, సాంకేతిక సవాళ్లతో ప్రక్రియ ఆలస్యం
- ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిన సర్కారు
- ఆ నివేదిక ఆధారంగానే ముందుకు..
హైదరాబాద్, వెలుగు: సెర్ప్( సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ), మెప్మా ( మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) సంస్థలను విలీనం చేసేందుకు చేపట్టిన ప్రక్రియకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం జీవో ఇచ్చినా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) ద్వారా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
ఈ రెండు సంస్థలను ఏకంచేస్తే ప్రభుత్వ లక్ష్యాలతోపాటు కోటి మంది మహిళలను కోటీశ్వరుల చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం నెరవేరుతుందని అధికారులు భావిస్తున్నారు. కానీ శాఖల మధ్య సమన్వయ లోపం, ఉద్యోగుల విలీనంలో సమస్యలు, స్కీమ్‌లలో వ్యత్యాసాలు, ఇతర సాంకేతిక అడ్డంకులతో ఈ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
స్కీమ్‌ల్లో తేడాలు..
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్, మెప్మా సంస్థలను విలీనం చేస్తూ జీవో జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను సమన్వయంతో ఒకే వేదిక నుంచి అమలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. సెర్ప్ గ్రామీణాభివృద్ధి శాఖ (పంచాయతీ రాజ్) కింద పనిచేస్తుండగా.. మెప్మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ (పట్టణాభివృద్ధి) పరిధిలో ఉంది. ఈ రెండు శాఖలు వేర్వేరు ఆదేశాలు, పరిపాలనా విధానాలను అనుసరిస్తున్నాయి.
సెర్ప్ గ్రామీణ ప్రాంతాల్లో 47 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలను నిర్వహిస్తుండగా.. మెప్మా పట్టణ ప్రాంతాల్లో 1.70 లక్షల సంఘాలను పర్యవేక్షిస్తున్నది. సెర్ప్ సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, గృహ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారిస్తుండగా.. మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి, సేవా రంగం, వాణిజ్య కార్యకలాపాలపై ఆధారపడుతున్నాయి. మెప్మా పట్టణ స్వయం ఉపాధి కార్యక్రమం (యూఎస్ఈపీ), అర్బన్ విమెన్ సెల్ఫ్-హెల్ప్ ప్రోగ్రాం (యూడబ్ల్యూఎస్పీ) లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
రుణాల వడ్డీ రాయితీలు, లబ్ధిదారుల ఎంపిక ప్రమాణాలు, అమలు విధానాలు వేర్వేరుగా ఉన్నాయి. మెప్మా ద్వారా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అందిస్తుండగా.. సెర్ప్ ద్వారా గ్రామీణ సంఘాలకు రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ఈ రెండింటిని కలపడం ద్వారా మహిళా సాధికారత, స్వయం ఉపాధి, బ్యాంకు రుణాలు, ఆర్థిక స్వావలంబన, ఇతర కార్యక్రమాల అమలు లాంటి లక్ష్యాలను సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
అలాగే, సంఘాలకు బ్యాంకు రుణాలు, ఆర్థిక సహాయం, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సౌకర్యాలు ఒకే వేదిక నుంచి అందనున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సంఘాల పర్యవేక్షణ, ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించవచ్చు. అయితే, ఈ రెండు సంస్థల కార్యక్రమాలను ఒకే విధానంలో మెర్జ్ చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ప్రణాళికలు, ఆర్థిక వనరుల విభజన, కార్యక్రమాల అమలు విషయంలో అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
ఉద్యోగుల విలీనంలో సమస్యలు
ఈ రెండు సంస్థల మెర్జింగ్ప్రక్రియలో ఉద్యోగుల విలీనం అనేది మరొక సమస్య. సెర్ప్‌లో సుమారు 3,872, మెప్మాలో 2 వేల మంది దాకా ఉద్యోగులు పని చేస్తున్నారు. పట్టణాల్లోని మెప్మా రిసోర్స్‌పర్సన్స్‌కు నెలకు రూ.6 వేల వేతనం చెల్లిస్తుంటే, సెర్ప్ ఆర్పీలకు నెలకు రూ.5 వేల చొప్పున ఇస్తున్నారు. ఒకవేళ ఈ రెండు గ్రూపులు కలిపితే జీతాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే క్లారిటీ లేదు. అధికారుల కేడర్ తగ్గుతుందనే భావనతో కొంతమంది ఉద్యోగులు ఈ ప్రక్రియకు ఒప్పుకోవడం లేదని తెలిసింది. జీతాలు, పదోన్నతులు, సీనియారిటీ, బదిలీలు, పని పరిస్థితులు వంటి అంశాల్లో తేడాలు రావొచ్చని వెనుకడుగు వేస్తున్నారు.
సెర్ప్ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి అలవాటు పడగా.. మెప్మా ఉద్యోగులు పట్టణ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. భౌగోళిక వ్యత్యాసంతో విలీనం తర్వాత ఉద్యోగుల బదిలీలు, విధుల కేటాయింపులో సమస్యలు తలెత్తుతాయని ముందుకురావడం లేదని సమాచారం. రెండు సంస్థల ఉద్యోగులకు వర్తించే సర్వీసు నిబంధనలు, ఒప్పంద ఉద్యోగుల స్థితిగతులు, పర్మినెంట్ ఉద్యోగుల హక్కులు వంటి అంశాల్లో తేడాలు వస్తాయని భావిస్తున్నారు. అయితే, ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రెండు సంస్థల విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.