డిజిటల్తో బీసీ ఉద్యమాన్ని అప్డేట్ చేయాలి

డిజిటల్తో బీసీ ఉద్యమాన్ని అప్డేట్ చేయాలి

దేశ  స్వాతంత్ర్యం అనంతరం ప్రజల్లో అనేక రకాల ఉద్యమాలు, ఆకాంక్షలు పురుడు పోసుకున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రధానంగా అనేక ఉద్యమాలు వెల్లివిరిసాయి.  అందులో వామపక్ష భావజాలం, దళిత వర్గాల నుంచి సామాజిక న్యాయ ఉద్యమాల నేపథ్యాల్లో బీసీ ఉద్యమం ఒక కీలక అధ్యాయంగా నిలిచింది. అనాదిగా పీడిత వర్గాల్లో సరైన ప్రాతినిధ్యం, సామాజిక, ఆర్థిక భాగస్వామ్యాల కోసం జరిగిన పోరాటం ఇప్పుడు ఒక కీలక దశకు చేరిన చారిత్రక సందర్భం ఇది. ఈనేపథ్యంలో  సంప్రదాయ పోకడలకు భిన్నంగా టెక్నాలజీతో ఉద్యమరీతులు మారాల్సిన అవసరం ఉంది.  బీసీ ఉద్యమానికి డిజిటల్ మీడియాను జోడించటం ద్వారా  ఉద్యమాలను అప్డేట్ చేయాలి. ఇది కేవలం  అవసరమే కాదు..  ఇది ఒక ఉద్యమ పురోగమనానికి ముందడుగు.

భారతదేశంలో 52%కి పైగా జనాభా బీసీలది.  కానీ,  రాజకీయాల్లో, పాలనలో,  వనరుల పంచాయితీలో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువే.  ఇది మారాలంటే ఉద్యమం కొత్త మార్గాల్లో సాగాలి. ఇక్కడే టెక్నాలజీని ఆయుధంగా మలుచుకోవాలి.  దగాపడ్డ గొంతుకలకు సరైన వేదికలు ఫేస్‌‌బుక్,  ట్విట్టర్ (X),  యూట్యూబ్, ఇన్‌‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌‌ఫాంలు  బీసీ ఉద్యమాలకు నూతన శక్తిని ఇస్తున్నాయి.  

గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన యువత ఇప్పుడు డిజిటల్  వేదికలపై వారి సమస్యలను, ఆశయాలను  ప్రపంచానికి పంచుతున్నారు.  సమాజాన్ని  చైతన్యవంతంగా మార్చే ప్రక్రియలో  సోషల్ మీడియాది అగ్రభాగం. ఒక డిమాండ్​ను  సమాజంముందు పెట్టేటప్పుడు  డేటా ఆధారిత పోరాటం అవసరం.  గతంలో ఉద్యమాలు భావోద్వేగాలపై ఆధారపడితే, ఇప్పుడు గణాంకాలే ఆయుధం. తద్వారా  నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఆర్బీఐ, ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ఓ వంటి నివేదికల ద్వారా బీసీల వెనుకబాటుతనాన్ని స్పష్టంగా చూపించి, ప్రభుత్వం ముందు స్పష్టమైన డిమాండ్లను ఉంచవచ్చు.

డిజిటల్ వేదికలపై బీసీ మేధావుల సమన్వయం

దేశవ్యాప్తంగా ఉన్న బీసీ మేధావులు, విద్యార్థులు, కార్యకర్తలు డిజిటల్ ఫోరమ్‌‌లలో చేరి ఆలోచనలను పంచుకోవడం ద్వారా ఉద్యమం గమ్యాన్ని స్పష్టంగా నిర్వచించగలం.  వన్ నేషన్ – వన్ ప్లాట్‌‌ఫామ్ మాదిరిగా ఆన్‌‌లైన్ సమావేశాలు, వెబినార్లు, డిజిటల్ కాన్ఫరెన్సులు ఉద్యమాన్ని మరింత బలపరిచాయి.  
టెక్నాలజీ వినియోగంలో ఒక ప్రధాన అడ్డంకి  డిజిటల్ డివైడ్. 

 బీసీ వర్గాల్లో చాలామందికి ఇంకా ఇంటర్నెట్,  స్మార్ట్‌‌ఫోన్ లకు యాక్సెస్ లేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రత్యేక బీసీ డిజిటల్ స్కీమ్‌‌లు, ఐటి శిక్షణ కేంద్రాలు అవసరం.  ప్రభుత్వం కూడా ఈ మార్పును ప్రోత్సహించేలా బీసీలకు టెక్ ఆధారిత ఉపకరణాలు అందించాల్సిన సమయం వచ్చింది. బీసీ యువతను టెక్నాలజీ యాక్టివిజంలోకి తీసుకురావడం అనేది ఉద్యమం భవిష్యత్ రూపాన్ని నిర్దేశిస్తుంది. 

డిజిటల్ ఉద్యమ యుగం

యూట్యూబ్ ఛానళ్ల ద్వారా బీసీ చరిత్రను పరిచయం చేయడం, సోషల్ మీడియా క్యాంపెయిన్‌‌ల ద్వారా హక్కుల కోసం మద్దతు కూడగట్టడం, టెక్ మాధ్యమాలలో ఉద్యోగ, విద్యావకాశాల సమాచారం పంచుకోవడం వంటి మార్గాల్లో యువత ఉద్యమానికి నడుం బిగించాలి. బీసీ సంఘాలు, సంఘటనలు మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే వారి పనితీరు డిజిటల్ అవ్వాలి. సభ్యత్వ రిజిస్ట్రేషన్, ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ అన్నీ సాంకేతికత ఆధారంగా నిర్వహించగలగాలి. ఇది వనరుల పునర్వినియోగంలో పారదర్శకతను తీసుకొస్తుంది. 

టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనం కాదు. అది సామాజిక మార్పు కోసం సాగే పోరాటంగా మార్చాలి.  బీసీ ఉద్యమానికి  సోషల్ మీడియా ఒక సైనిక శక్తిగా మారుతోంది.  అది గ్రామాల నుంచి గగనతలాల వరకూ ప్రతిధ్వనించాలి.  టెక్నాలజీని సొంతం చేసుకొని బీసీ సామాజిక న్యాయం కోసం నూతన దిక్కులను అన్వేషించాలి. ఇది బీసీ డిజిటల్ ఉద్యమ యుగం.

- దొమ్మాట వెంకటేష్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్