
- సీసీఐ, ఎస్ఐఐఎల్ పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామికి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఐఎల్) పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నెలాఖరులో తెలంగాణకు వచ్చి, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పనితీరుతో పాటు సంబంధిత పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపట్టేలా సమీక్ష నిర్వహిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
బుధవారం ఢిల్లీలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో సీసీఐ, ఎస్ఐఐఎల్ పునరుద్ధణకు సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, సీసీఐ, ఎస్ఐఐఎల్, కేంద్ర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పరిశ్రమల పునరుద్ధరణ అవశ్యకతను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
సీసీఐ, ఎస్ఐఐఎల్ మూతపడటానికి దారితీసిన పరిస్థితులు, పరిశ్రమల పునరుద్ధరణతో యువతకు ఉపాధి అవకాశాల మెరుగుదల, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను వివరించారు. ఆర్థిక, సామాజిక పురోగతికి దన్నుగా నిలిచే ఈ పరిశ్రమలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. వెనుకబడిన, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ పరిశ్రమల పునరుద్ధరణతో ప్రాంతీయాభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుందని చెప్పారు.
అలాగే, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌కేఎల్) పునరుద్ధరణను రూ.5 వేల కోట్లతో చేపట్టామని వివరించారు. శ్రీధర్ బాబు అందించిన వివరాలపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఈ రెండు పరిశ్రమలకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.