
సూర్యాపేట, వెలుగు : తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం తిరుమలగిరి కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. భూమి కోసం పోరాటం చేసిన చరిత్ర తుంగతుర్తికి ఉందని, సాయుధ పోరాటాలు ఇక్కడి నుంచే మొదలు పెట్టారని కొనియాడారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మందుల సామేల్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే మూడున్నర ఏండ్లలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. గత పాలకులు పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. జూలై 14న జరిగే నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్కల్పిస్తూ కేబినెట్నిర్ణయం తీసుకోవడం హర్షణీమని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. జూలై 14 న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి 70 వేల మంది తరలిరానున్నట్లు తెలిపారు. అనంతరం కారుణ్య నియామకం కింద 9 మంది, ఎంపీఎల్ హెచ్ కింద ఎంపికైన 24 మందికి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.