నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే.. కేంద్రంపై నింద

నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే..  కేంద్రంపై నింద
  • శాఖల ఖర్చులను తగ్గించడం కాదు.. దోపిడీని తగ్గించుకో
  • కేంద్రం నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​
  • సీఎం కేసీఆర్​​పై బీజేపీ రాష్ట్ర చీఫ్​ లక్ష్మణ్​ ఫైర్​

హైదరాబాద్, వెలుగు:  వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే  సీఎం కేసీఆర్‌‌  కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా కూడా ఆర్థిక మాంద్యం లేదని, ఉన్నదల్లా కేవలం ఆర్థిక మందగమనమేనని తెలిపారు. కేసీఆర్ అసమర్థ పాలన, అశ్రిత పక్షపాతం, అవినీతి వల్లే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందన్నారు. ఫాంహౌజ్ నుంచి కేసీఆర్, ట్విట్టర్ నుంచి కేటీఆర్  బయటకు రానంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన విమర్శించారు. చీఫ్ మినిస్టర్ చాలా చీప్ గా మాట్లాడుతున్నారని, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ పేరిట బకాయిల తెలంగాణ, బడాయిల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. సోమవారం బీజేపీ ఆఫీసులో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై, ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్​ ఆర్థిక మాంద్యం నెపం వేయడం పూర్తిగా కుట్రపూరితమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు ఖర్చులు తగ్గించుకోవాలని సీఎం కోరడం, నిధుల ఖర్చుపై కోతలు విధిస్తామనడం సరైంది కాదన్నారు. కేసీఆర్ తన దోపిడీని తగ్గించుకుంటే, ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదని వ్యాఖ్యానించారు. ఏడాది కాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా స్తంభించిపోయిందన్నారు.

శ్వేతపత్రం విడుదల చెయ్​

రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, రూ. 50 వేల కోట్లు బకాయిలు పడిందని లక్ష్మణ్​ తెలిపారు. కేంద్రం నుంచి వెయ్యి కోట్లు రావాలని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులిస్తే   బకాయిపడ్డ  రూ. 50 వేల కోట్ల అప్పులు తీరుతాయా అని ఆయన ప్రశ్నించారు. నెలకు కనీసం రూ. 4 వేల కోట్ల అప్పు చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని, కొత్తగా అప్పులు చేస్తే తప్ప పాత అప్పులు తీర్చలేని దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రానికి  రూ. 95 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంట్ లో కేంద్రం ప్రకటిస్తే.. అదే సభలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇది తప్పు అని అనలేదంటే కేంద్రం ఇచ్చిన నిధులు వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం తన వాటాగా వంద శాతం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కేవలం 10 శాతం నిధులు కూడా చెల్లించడం లేదన్నారు. కేంద్రం నిధులను వినియోగించుకునే రాష్ట్రాల జాబితాలో తెలంగాణది 19వ స్థానమని లక్ష్మణ్  పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే మన రాష్ట్రం కేంద్రం నిధులను ఎలా వాడుకుంటుందో తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చింది, అందులో ఖర్చు చేసింది ఎంత అనే వివరాలపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు బీజేపీ సిద్ధమని, అందుకు టీఆర్ఎస్ రెడీగా ఉందా అని ప్రశ్నించారు.

 BJP state chief Laxman Fire on CM KCR