- స్పీకర్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్లను స్పీకర్ సుమోటోగా తీసుకొని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు బీఆర్ఎస్ అని, బయట కాంగ్రెస్ అని చెప్తూ డ్రామాలాడటం సిగ్గుచేటన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించుకుని బుధవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన ‘దీపోత్సవం’కార్యక్రమంలోహాజరైన రాంచందర్ రావు, పార్టీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర నేతలు వేముల అశోక్, బంగారు శృతిలతో కలిసి దీపాలు వెలిగించి నివాళులర్పించారు.
అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. దానం నాగేందర్ బహిరంగంగానే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చెప్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సంబంధం లేనట్టు మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ఈ తప్పుడు మాటలను రేవంత్ వెంటనే వెనక్కి తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాంటీ డిఫెక్షన్ చట్టం తెచ్చిన కాంగ్రెస్సే.. ఇప్పుడు ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.
మరోవైపు, దోస్తీలు మారుస్తున్న మజ్లిస్.. ఎంఐఎం పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉన్నోళ్లతోనే అంటకాగుతుందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, -బీఆర్ఎస్ మధ్య ఎంఐఎం మధ్యవర్తిగా మారుతుందని జోస్యం చెప్పారు. బంగారు శృతి మాట్లాడుతూ.. బుధవారం నుంచి 31 వరకు వాజ్‌పేయి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, మండలాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
