కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కుట్ర : సంజయ్ .

కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కుట్ర : సంజయ్  .
  • సింగరేణిని ప్రైవేటీకరించాలని కేసీఆర్ చూస్తున్నడు 
  • అట్ల చేస్తే ఊరుకోం.. చెట్టుకు కట్టేసి కొడ్తం  
  • అధికారంలోకి వస్తే సింగరేణికి బకాయిలన్నీ 
  • చెల్లిస్తామని హామీ భూపాలపల్లిలో బీజేపీ సభ

జయశంకర్‌‌ భూపాలపల్లి/కరీంనగర్, వెలుగు: తెలంగాణలో ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ఆరోపించారు. అందులో భాగంగానే బీజేపీని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘బీఆర్‌‌ఎస్‌, కాంగ్రెస్‌‌ ఒక్కటే. ఈసారి బీఆర్‌‌ఎస్‌‌కు తక్కువ సీట్లు వస్తే.. కేసీఆర్ మళ్లీ కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలను కొని అధికారంలోకి వస్తారు. అలా జరగకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ కు డిపాజిట్లు కూడా దక్కలేదు. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ రెండు సీట్లకే పరిమితమైంది. వరంగల్‌‌, కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్ కు ఒక్క కార్పొరేటర్ కూడా లేడు. అలాంటి కాంగ్రెస్‌‌ గ్రాఫ్‌‌ పెంచేందుకు కేసీఆర్‌‌ ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు.

 తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, జాబ్‌‌ చార్ట్‌‌ ప్రకటించి ఏటేటా ఉద్యోగాలు ఇస్తామని, పేదలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ‘మహాజన్‌‌ సంపర్క్‌‌ అభియాన్‌‌’ కార్యక్రమంలో భాగంగా గురువారం భూపాలపల్లిలో నియోజకవర్గ ఇన్ చార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొదట భూపాలపల్లి టౌన్‌కు చేరుకున్న సంజయ్‌..‌ అంబేద్కర్‌‌ విగ్రహానికి నివాళులర్పించి, ర్యాలీగా బహిరంగ సభకు చేరుకున్నారు. 

కాళేశ్వరంతో ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే.. 

బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. అదే జరిగితే కేసీఆర్ ను గల్లాపట్టి బజారుకీడుస్తామని హెచ్చరించారు. ‘‘సింగరేణిలో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నది. సింగరేణిని తన కూతురు కల్వకుంట్ల కవిత పేరిట లీగల్‌‌గా మార్చి దాన్ని పూర్తిగా అమ్మేసే ప్లాన్‌‌లో కేసీఆర్ ఉన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఊరుకోం. కేసీఆర్‌‌ను చెట్టుకు కట్టేసి కొడతాం’’ అని హెచ్చరించారు.  సింగరేణికి సర్కార్ రూ.25 వేల కోట్ల బకాయి పడిందని, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి సంస్థను దిగజార్చిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే సింగరేణికి బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ‘‘లక్షా ఇరవై వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ద్వారా భూపాలపల్లి జిల్లాలో ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్‌‌ కట్టి ఏం లాభం. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు” అని విమర్శించారు.

అమరులు ఇప్పుడు  గుర్తుకొచ్చారా? 

కేసీఆర్​కు అమరులు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అని సంజయ్ ప్రశ్నించారు. 1,400 మంది అమరుల త్యాగాలతో తెలంగాణ వస్తే, కేసీఆర్ రాజ్యమేలుతున్నాడని ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్ ఈ 9 ఏండ్లలో ఏనాడూ అమరులకు నివాళులు అర్పించలేదు. 1,400 మంది చనిపోతే 600 మందికి మాత్రమే సాయం చేశారు. సిగ్గులేకుండా ఇయ్యాల అమరుల కుటుంబాలు, ఉద్యమకారులకు సన్మానాల పేరుతో మరో డ్రామాకు తెరదీశారు” అని మండిపడ్డారు. తొమ్మిదేండ్లలో ప్రధాని మోదీ ఎంతో చేశారని.. మరి కేసీఆర్ చేసిందేమిటి? అని ప్రశ్నించారు. ‘‘రుణమాఫీ చేయలే. నిరుద్యోగ భృతి ఇయ్యలే. ఫ్రీ యూరియా, విత్తనాల్లేవ్. ఇంటికో ఉద్యోగం, పోడు పట్టాలు ఇయ్యలే. ఎస్టీ రిజర్వేషన్లు పెంచలేదు” అని ఫైర్ అయ్యారు. సభలో మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్‌‌, నాగపూరి రాజమౌళి, చందుపట్ల సత్యపాల్‌‌ రెడ్డి, సునీల్‌‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు యుగేందర్‌‌, వెన్నంపల్లి పాపయ్య, గణపతి, దొంగల రాజేందర్‌‌ తదితరులు పాల్గొన్నారు.

ధరణి బాధితులతో భారీ సభ పెట్టొచ్చు

ధరణి పోర్టల్ మొత్తం తప్పుల తడకగా మారిందని సంజయ్ అన్నారు. ధరణి వల్ల రైతులు అల్లాడుతున్నారని, ధరణి బాధితులందరినీ కలిపితే పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభనే పెట్టొచ్చని చెప్పారు. ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో సంజయ్ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సంజయ్ సవాల్ విసిరారు. ‘‘పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో చర్చిద్దాం. కేసీఆర్.. అందుకు సిద్ధమా?” అని సవాల్ చేశారు. కేసీఆర్ రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. ఇలా ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.  ‘‘తొమ్మిదేండ్లలో ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. 

ఇయ్యాల వాళ్లను పిలిచి సన్మానం చేయడం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననడం.. పెద్ద జిమ్మిక్కు” అని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని.. కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యం ఉన్న నేతలెవరూ కాంగ్రెస్ లో చేరొద్దని సూచించారు. తెలంగాణలో బీజేపీ సింహం లెక్క సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. గద్దర్ పార్టీపై స్పందిస్తూ.. ‘‘ఉద్యమంలో గద్దరన్న కాళ్లకు గజ్జె కట్టి పాటపాడారు. కేసీఆర్ మాత్రం గద్దర్ గజ్జె కడితే తెలంగాణ వచ్చిందా? అని వెటకారం చేశారు. గద్దర్ ఇప్పుడు కేసీఆర్ ను నిలదీయాలి” అని సూచించారు.