రాష్ట్రంలో ఆడపడుచులకు గౌరవం లేదు

రాష్ట్రంలో ఆడపడుచులకు గౌరవం లేదు

యాచారం: దళిత ఆడపడుచు ఎంపీపీకి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ.. బాధ్యుల పై తక్షణమే చట్టపరమైన చర్య తీసుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు బాబుమోహన్ డిమాండ్ చేశారు. ఫార్మా సీటీ రోడ్డు శంకుస్థాపనలో యాచారం ఎంపీపీ పై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దాడి చేసి అగౌరవపరచిన‌ విషయంలో ఆమెను మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు బాబుమోహన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులంటే ప్రభుత్వానికి చిన్నచూపు ఏర్పడింది. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రాష్ట్రంలో ఆడపడుచులకు గౌరవం లేదు. ఏ ఒక్కరికీ పదవులు శాశ్వతం కాదని అన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను ఒకే విధంగా చూడాలన్నారు బాబుమోహ‌న్. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కేవలం ఒక పార్టీకే కాదని, అన్ని పార్టీల వారికి, ప్రజలందరికీ వారు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలే నని అన్నారు. ప్రోటోకాల్ అనేది కచ్చితంగా పాటించాలని, అందరూ ప్రజాప్రతినిధులకు తగు గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. ప్రజలు 5 యేండ్లు చూసి బుద్ది చెప్తారన్నారు. ఏదైనా తప్పు జరిగిన క్షమించమని అడగడంలో తప్పులేదన్నారు. ఇంత జరిగిన ముఖ్యమంత్రి స్పందించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఎంపీపీకి జరిగిన అన్యాయం విషయంలో స్పందించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.