కేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు

కేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు

హైదరాబాద్: రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలు బంద్ చేసిండని కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు బంధు ఇచ్చి... నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచిండని కేసీఆర్ పై మండిపడ్డారు. రైతుల కోసం తాను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేనోడు... రైతులను ఎట్లా ఆదుకుంటాడని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టబోతోందని అబద్ధాలు చెబుతూ కేసీఆర్ రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 

ఉచిత కరెంట్ పేరుతో డిస్కంలకు కేసీఆర్ రూ. 60 వేల కోట్లు బకాయి పెట్టారన్ని సంజయ్... పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో గంట సేపు కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పే మాటలను రైతులు నమ్మవద్దన్న బండి సంజయ్... రైతులను ఆదుకునే ఒకే ఒక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. రకరకాల స్కీములతో ఒక్కో ఎకరాకు కేంద్రం రూ.41 వేలు అందిస్తోందని తెలిపారు. ప్రతి కిసాన్ మోర్చా కార్యకర్త ఈ విషయాలన్నింటినీ రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. 

దళిత బంధుతో దగా చేస్తుండు...

దళిత బంధు పేరుతో దళితులను దగా చేస్తోండని కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ ఏవేవో కథలు చెప్పిన కేసీఆర్... ఇప్పుడు దళిత బంధు పేరుతో డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. దళితుడిని సీఎం చేయకుంటే తల నరుక్కుంటానన్న కేసీఆర్.. దళితుడిని సీఎం చేయకుంటా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదన్న సంజయ్... కేసీఆర్ ను నమ్మి మరోసారి మోసపోవద్దని హెచ్చరించారు.