ఇబ్రహీంపట్నం బాధితులకు కోటి నష్టపరిహారం ఇయ్యాలె

ఇబ్రహీంపట్నం బాధితులకు కోటి నష్టపరిహారం ఇయ్యాలె

ఇటీవల ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. నలుగురు మహిళలు చనిపోతే సర్కార్ ఏం చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎంకు పేరు ప్రఖ్యాతలు ముఖ్యమా.. పేదల ఆరోగ్యం ముఖ్యమా అని ప్రశ్నించారు. నీ పేరు, ప్రఖ్యాతల కోసం ఈ రోజు పేదలు బలైతున్నారన్నారు. కుటుంబ ఆపరేషన్లు వికటించి ప్రాణాలు కోల్పోతుంటే బాధితులను సీఎం ఎందుకు పరామర్శించడం లేదని నిప్పులు చేరిగారు. రికార్డుల కోసమే సర్కారు పేదలను చంపుతుందన్న ఆయన.. సర్కారు పేదల ఉసురుపోసుకుంటుందన్నారు. 34మందికి గంటలోపే ఆపరేషన్లు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. చనిపోయిన వారంతా పేద కుటుంబాలకు చెందినవారేనన్న ఆయన.. గొప్పల కోసమే సీఎం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.  సీఎం ఎప్పుడూ అబద్దాలే చెప్తారని విమర్శించారు. మంత్రుల స్థానంలో వేరే వాళ్లుంటే ఈ పాటికే వాళ్లను సీఎం బర్తరఫ్ చేసేవారనన్నారు. సీఎం వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలన్నారు.

 పేదలను పరామర్శించకుండా ఉండేంత బిజీ ఏముంది.. ?

ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఒక్కరు కూడా ఇబ్రహీంపట్నం ఘటన బాధితులను పరామర్శించలేదని బండి సంజయ్ అన్నారు. భూమి కబ్జాలు, ఇసుక ,లిక్కర్, క్యాసినో ఆడుకుంటూ బిజీగా ఉన్నారా?  అంటూ ఆయన కోపం వ్యక్తం చేశారు.పేదలను పరామర్శించకుండా ఉండేంత బిజీ అంత ఏముందని ప్రశ్నించారు. బాధితులకు తక్షణమే కోటి రూపాయల నష్ట పరిహారం చేయాలన్న బండి సంజయ్.. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లును కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు చేరుకున్న ఆయన.... డాక్టర్లను అడిగి మహిళల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సమయంలో బండి సంజయ్ తో పాటు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, వెంకటేశ్వర్లు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి సహా పలువురు బీజేపీ నేతలు అపోలో ఆసుపత్రికి వెళ్లారు. 

ఇబ్రహాంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటికే మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాలను సుమోటగా తీసుకున్న కమిషన్ ఘటనపై సమగ్రమైన నివేదికను అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. అక్టోబర్ 10 తేదీ లోపు నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక ఈ ఘటనలో మరికొంత మందికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం హాస్పిటల్లో 18 మందికి డాక్టర్లు టెస్టులు చేశారు. ఇందులో 12 మందికి ఇబ్బందులు ఉండటంతో నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికే ఏడుగురిని అపోలో హాస్పిటల్ కు షిప్ట్ చేయగా.. ఇందులో ఒకరు సీరియస్ గా ఉన్నారు.