పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట

పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట

జనగామలో బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం  కార్యకర్తల అరెస్ట్ కు నిరసనగా ఆయన ధర్మదీక్ష చేపట్టడానికి సిద్ధమవగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు రావడంతో బీజేవైఎం కార్యకర్తలు నిన్న(సోమవారం) ఆమె ఇంటి ముట్టడికి యత్నించారు. 26 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి అరెస్ట్ నిరసనగా ఇవాళ జనగామలో బండి సంజయ్ ధర్మ దీక్షకు సిద్ధమవ్వగా పోలీసులు  అడ్డుకున్నారు.  ఆయనను అరెస్ట్ చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించడంతో  పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.

కాగా బీజేపీ కార్యకర్తల అరెస్ట్ పై దుమారం కొనసాగుతోంది. కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు పెడుతారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దలు బండి సంజయ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో టెన్షన్ నెలకొంది. ఆయనపై దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పామ్నూరు పాదయాత్ర శిబిరం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల భద్రతను బండి సంజయ్ తిరస్కరించారు. తన భద్రతను కార్యకర్తలే చూసుకుంటారని ఆయన చెప్పారు. కార్యకర్తలకు ఏదైనా జరిగితే అంతు చూస్తామని హెచ్చరించారు.

లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ సోమవారం బీజేవైఎం నేతలు కవిత ఇంటిదగ్గర ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బలవంతంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కవితను పరామర్శించడానికి టీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. కవితను కలిసిన వారిలో మంత్రితో పాటు పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు.