ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాసిండు:బండి సంజయ్

 ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాసిండు:బండి సంజయ్

లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకే కేసీఆర్ ఫాంహౌజ్ డ్రామా ఆడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాసుకున్నడని ఆరోపించారు. ఫాంహౌజ్ ఘటనలో నలుగురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేలను స్టేషన్కు ఎందుకు తీసుకుపోలేదన్నారు. 26న ఘటన జరిగితే పంచనామాపై 27న సంతకం చేసినట్లు ఉందని చెప్పారు. ఆధారాలు ఉంటే కోర్టుకు ముందే ఎందుకు సబ్మిట్ చేయలేదన్నారు. కొడుకు కేటీఆర్ ఫాంహౌజ్ ఘటనపై ఎవరు మాట్లాడొద్దని చెప్తాడు..కేసీఆర్ మాత్రం అన్నీ బయటపెడతాడని చురకలంటించారు. ప్రగతిభవన్లో కేసీఆర్ చూపించిన వీడియోలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాట్లాడుతుంటే..ఆయన ముఖంలో భయం కనిపించిందన్నారు. 

ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం..
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బండి సంజయ్ విమర్శించారు. 37 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ సంతలో కొనుగోలు చేసినట్లు కొన్నారని మండిపడ్డారు. 2014లో టిడిపి ఎమ్మెల్యేను చేర్చుకుని మంత్రి పదవి కూడా కట్టబెట్టారని గుర్తు చేశారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకుని మరోసారి మంత్రి పదవి ఇచ్చారన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతాడని..అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడితే సస్పెండ్ చేస్తాడని అన్నారు.జారీ చేసిన జీవోలు పబ్లిక్ డొమైన్లో  ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదని మండిపడ్డారు. 

బీజేపీకి సంబంధం లేదు..
తుషార్ అనే వ్యక్తికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ అన్నారు. కేరళలో అతను బీడీజేఎస్ తరపున పోటీ చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్ అప్పట్లోనే దొంగ పాస్ పోర్టులు తయారు చేశారని విమర్శించారు. సీబీఐ రాష్ట్రంలోకి రావొద్దని ఆగస్టులోనే జీవో విడుదల చేశారన్నారు. కొడుకు, కూతురు కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తలకాయ కిందకు..కాళ్లు పైకి చేసినా..కేసీఆర్ను ఎవరు నమ్మరని చెప్పారు. బీజేపీలో ఎవరు చేరినా...రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామన్నారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన పని తమకు లేదన్నారు. మరో 13 నెలల్లో ఎన్నికలున్నాయని..ఈ సమయంలో కూలిస్తే..బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. 

కొప్పులను అవమానించాడు..
గురువారం ప్రెస్మీట్లో ఉద్యమకారుడు, మంత్రి కొప్పుల ఈశ్వర్ను కేసీఆర్ అవమానించారని బండి సంజయ్ అన్నారు. అసలు కొప్పుల ఈశ్వర్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఆశపెట్టారని చెప్పారన్నారు. కానీ కేటీఆర్ వల్లే కొప్పులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్నారు. మంత్రి వర్గంలో ఉన్న ఏకైక దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ అని చెప్పారు. ఉద్యమం చేసిన నాయకులను కేసీఆర్ పక్కన పెట్టేశారని...ఉద్యమద్రోహులను కేసీఆర్ పక్కలో పెట్టుకున్నారని విమర్శించారు.