టీఆర్ఎస్​ అవినీతి సర్కార్​ను ప్రజలు దించేస్తరు

టీఆర్ఎస్​ అవినీతి సర్కార్​ను ప్రజలు దించేస్తరు

బీజేపీలో చేరిన ఐటీ ఉద్యోగులు

కూకట్​పల్లి, వెలుగు : టీఆర్​ఎస్​ అవినీతి సర్కార్​ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. రాష్ట్రంలోనే కాక దేశంలో ఎక్కడ ఏ స్కాం జరిగినా సీఎం కేసీఆర్​ కుటుంబసభ్యుల పాత్ర ఉందనే అంశాలు బయట పడుతుండండతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోవడానికి కేసీఆర్​ కుటుంబమే కారణమని దుయ్యబట్టారు. ఆదివారం ఉదయం హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో పలువురు ఐటీ ఉద్యోగులు బీజేపీలో చేరారు. వారికి బండి సంజయ్​పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రం మొత్తాన్ని కలుషితం చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని విమర్శించారు.

‘‘కింది నుంచి పైదాక ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ అవినీతి మయం చేయడంతో  పైసలు లేకుండా ఒక్క చిన్న పని కూడా జరగక సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నరు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలక్షేపం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రమే. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసినందుకు సిగ్గు పడాల్సింది పోయి ట్విట్టర్​ టిల్లు అమెరికాకు వెళ్లే ముందు, వచ్చే ముందు మాత్రం ఫొటోలకు ఫోజులు కొడుతడు” అని బండి సంజయ్​ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశ విజయాలను చూసి ప్రశంసిస్తుంటే కేసీఆర్​, కేటీఆర్  మాత్రం చైనాని పొగుడుతూ దేశాన్ని కించపరుస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్​రావు, మేడ్చల్​ జిల్లా అర్బన్​ బీజేపీ నాయకుడు పన్నాల హరీష్​రెడ్డి, కూకట్​పల్లి నియోజకవర్గం ఇన్​చార్జ్​  మాధవరం కాంతారావు, మూసాపేట కార్పొరేటర్​ మహేందర్​ తదితరులు పాల్గొన్నారు.