టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాగానాలే : బండి సంజయ్​

టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాగానాలే : బండి సంజయ్​

హైదరాబాద్, వెలుగు: టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు ఊహాగానాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం పార్టీ జిల్లాల అధ్యక్షులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఊహాజనిత కథనాలను ఎవరూ పట్టించుకోవాల్సిన పనిలేదని, మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను ఉధృతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్​షా ప్రతిపక్ష పార్టీల సీఎంలు కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, స్టాలిన్ సహా ఎంతో మందిని కలిశారని గుర్తు చేశారు. దేశాభివృద్ధి మాత్రమే బీజేపీ లక్ష్యమన్నారు. చంద్రబాబుతో పొత్తుపైనే సమావేశంలో చర్చించారని ప్రచారం చేయడంలో నిజం లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంటే దెబ్బతీయడానికే బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులంతా కలిసే పోటీ చేస్తారన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, వారంతా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్​ను గద్దె దించడం ఖాయమని తెలిపారు.