
రాష్ట్రంలో టీఆర్ఎస్ దౌర్జన్యాలను సహించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. పోలీసుల డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ఎలాంటి కారణం లేకుండానే అర్వింద్ ఇంటిపై దాడి చేయడం వెనుక కల్వకుంట్ల కుటుంబం అహంకారం ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు.
సీఎం కేసీఆర్ రాజకీయాల కోసం కూతురు కవితను పావుగా వినియోగించుకుటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది కాబట్టే టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..రాజకీయ నేతల ఇండ్లపై దాడులు చేయడం సరికాదన్నారు. దాడులను ముఖ్యమంత్రి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ నేతల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్ కలహాల ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎంపీ అర్వింద్ ఇంటికి వెళ్లి పరామర్శించిన బండి సంజయ్..దాడి జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.