నిర్మల్​ జిల్లాలో ముగిసిన బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర

నిర్మల్​ జిల్లాలో ముగిసిన బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర

నిర్మల్, వెలుగు:నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర బుధవారం ముగిసింది. పది రోజుల యాత్ర గ్రాండ్ ​సక్సెస్​కావడంతో కార్యకర్తలు, లీడర్లు ఫుల్​జోష్​లో ఉన్నారు. భైంసా, నిర్మల్, ఖానాపూర్​బహిరంగ సభల్లో రాష్ట్ర బీజేపీ చీఫ్​బండి సంజయ్​ టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​లను లక్ష్యంగా చేసుకుంటూ చేసిన విమర్శలు రాజకీయంగా దుమారంరేపాయి. భైంసాలో ఎంఐఎం, నిర్మల్ లో మంత్రి, ఖానాపూర్ లో ఎమ్మెల్యే రేఖా నాయక్​లను లక్ష్యంగా చేసుకొని స్థానిక సమస్యలపై గళమెత్తారు. జనాన్ని ఆకట్టుకునే రీతిలో కేసీఆర్ భాషకు  కౌంటర్​గా సంజయ్​ మాటలు ప్రజలను ఆకర్శించాయి. సభలు, యాత్రల్లో ఆయన కేసీఆర్, కేటీఆర్ ల తీరుపై ప్రజలకు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టడం ఆకట్టుకుంది. యాత్రసందర్భంగా తాను బస చేసిన ప్రతీ శిబిరం వద్ద వివిధ జిల్లాల పార్టీ లీడర్లతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల వరకు ఇదే జోష్​కొనసాగాలని సూచించారు. 

ఎమ్మెల్యే కమీషన్​ ఇస్తేనే పనులు అవుతున్నయ్​..

ఖానాపూర్/ఆసిఫాబాద్​,వెలుగు: ఖానాపూర్​ ఎమ్మెల్యే రేఖానాయక్​పై బండి సంజయ్​తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమీషన్​తీసుకోనిదే ఎమ్మెల్యే ఏ పని చేయడంలేదని ఆరోపించారు. పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, డిగ్రీ కాలేజీలు అన్ని వాళ్లవేనన్నారు. ఖానాపూర్ ప్రాంత రైతులకు జీవనాధారమైన సదర్​మాట్​పై ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పట్టణంలో  రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఉద్య మాలుచేస్తే అధికార  పార్టీ లీడర్లు పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ లో బీజేపీ జెండా ఎగరాలని కోరారు. కమీషన్లు తీసుకునే మంత్రి, ఎమ్మెల్యేలకు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు.   పెంబి ఎంపీపీ భూక్యా కవిత, మాజీ సర్పంచ్ భూక్యా గోవింద్ బీజేపీ లో చేరారు. అంతకు ముందు  బండి సంజయ్​ ఆసిఫాబాద్​ జిల్లా లీడర్లతో సమావేశమయ్యారు. ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షురాలు  రమాదేవి, జడ్పీటీసీ జానుబాయి, అసెంబ్లీ నాయకుడు హరినాయక్ పాల్గొన్నారు.