అలంపూర్ నుంచి రెండో విడత యాత్ర షురూ 

అలంపూర్ నుంచి రెండో విడత యాత్ర షురూ 

ప్రారంభించనున్న తరుణ్ చుగ్.. అక్కడే సభ 
వచ్చే నెల 14న మహేశ్వరంలో ముగింపు సభ 
మొత్తం 31 రోజులు.. 381 కిలోమీటర్లు 

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. మొదట ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని పార్టీ స్టేట్ ఆఫీసులో నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంజయ్ పాల్గొంటారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ఆలయానికి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పాదయాత్రను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభిస్తారు. 5 గంటలకు అలంపూర్ లో మొదటి బహిరంగ సభ జరుగుతుంది. 

అనంతరం సంజయ్ 3 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించి, అమ్మాపూర్ లో రాత్రి బస చేస్తారు. తర్వాతి రోజు నుంచి గద్వాల, మక్తల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, నారాయణపేట, కల్వకుర్తి మీదుగా పాదయాత్ర కొనసాగి.. వచ్చే నెల 14న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో ముగుస్తుంది. ఆ రోజు అక్కడ సభ ఉంటుంది. మొత్తం 31 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. మొదటి రోజు మినహాయిస్తే, మిగతా రోజుల్లో రోజుకు 13 కిలోమీటర్ల చొప్పున మొత్తం 386 కిలోమీటర్లు యాత్ర సాగనుంది. ఇందులో భాగంగా ఊరూరా రచ్చబండలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఎక్కువగా లోకల్ సమస్యలు, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే సంజయ్ ప్రస్తావించనున్నారు. యాత్ర టైమ్ లో పలువురు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, ఆ పార్టీకి చెందిన సీఎంలు వచ్చి సంజయ్ కి సంఘీభావం తెలపనున్నారు. 

ఏర్పాట్లకు 40 కమిటీలు... 

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో యాత్రలో పాల్గొనే నాయకులు, కార్యకర్తలు వడ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5  నుంచి రాత్రి 9 గంటల వరకు యాత్ర కొనసాగించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌలతులు కల్పించడం కోసం మొత్తం 40 కమిటీలను నియమించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. కాగా, సంజయ్ మొదటి విడత పాదయాత్ర పోయినేడు ఆగస్టు 28న ప్రారంభమై, అక్టోబర్ 2న ముగిసింది. మొత్తం19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 438 కిలోమీటర్లు కొనసాగింది.