బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. ఆ పార్టీతో పొత్తులేదు: కిషన్రెడ్డి

బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. ఆ పార్టీతో పొత్తులేదు: కిషన్రెడ్డి
  • కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నరు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే చీకటి ఒప్పందం ఉంది
  • 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ ధీమా
  • నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం
  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు పూజలు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని కొందరు మూర్ఖులు ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. అన్ని లోక్​సభ స్థానాల్లో సింగిల్​గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీతో తామెందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్​లోనూ ఇలాగే ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇలాంటి పుకార్లు నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు. 17 లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర ప్రారంభిస్తున్నామన్నారు. సోమవారం హైదరాబాద్​లోని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రచార రథాలకు పూజలు చేసి వెహికల్ నడిపారు. ఆ తర్వాత సాయంత్రం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తది.

అన్ని మండలాలు, నియోజకవర్గాల గుండా విజయ సంకల్ప యాత్ర కొనసాగుతది. మంగళవారం నుంచి మొదలయ్యే యాత్ర.. మార్చి 2 దాకా జరుగుతుంది. మోదీయే మళ్లీ ప్రధాని కావాలని యువత, విద్యార్థులు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు’’అని కిషన్ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు కూడా ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.

5,500 కి.మీ.. 106 సమావేశాలు

సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘కుమ్రంభీమ్​​ విజయ సంకల్ప యాత్రను బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత భైంసా నుంచి ప్రారంభమిస్తాం. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.

రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర.. కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలను కవర్ చేస్తుంది. భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర.. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్​లో కొనసాగుతుంది. కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో సాగుతుంది’’అని తెలిపారు.

కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర.. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. యాత్రలో భాగంగా కేవలం రోడ్ షోలు మాత్రమే నిర్వహిస్తామని, బహిరంగ సభలు ఉండవని తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ యాత్ర ముందుకు సాగుతుందన్నారు. మొత్తం దాదాపు 5,500 కి.మీ మేర యాత్ర కొనసాగిస్తామని, 106 సమావేశాలు, 102 రోడ్​షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు. 

బీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ అవినీతి వివరిస్తాం

మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కాంగ్రెస్ అవినీతిని ప్రజలకు చెప్తామన్నారు. ఇండియా కూటమి టెంట్లు కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర పాటల సీడీ, పోస్టర్​ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ తరఫున జన్ సందేశ్ డిజిటల్ పేపర్​నూ ఆయన ప్రారంభించారు. తర్వాత నారాయణ్‌‌‌‌‌‌‌‌ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్‌‌‌‌‌‌‌‌పాల్ రెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.