బీజేపీ అంటే టీఆర్​ఎస్​కు హడల్​

బీజేపీ అంటే  టీఆర్​ఎస్​కు హడల్​

హైదరాబాద్, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌కు కాంగ్రెస్సే అసలైన ప్రత్యర్థి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌ మండిపడ్డారు. ‘కండ్లున్న కబోది కేటీఆర్’ అని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలు ఆయనకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నాయన్నారు. గల్లీలల్లో కూడా బీజేపీ బలపడుతోందని, చాపకింద నీరులా రాష్ట్రమంతా విస్తరిస్తోందని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌‌లో లక్ష్మణ్ మాట్లాడారు. ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి పొద్దున తిట్టుకుంటరు. రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటరు. అందుకే గాంధీభవన్‌‌కు, తెలంగాణభవన్‌‌కు పెద్దగా తేడా లేదు. ఈడ టులెట్ బోర్డు, ఆడ వెల్ కమ్ బోర్డు ఉంటది’ అన్నారు. టీఆర్ఎస్ వేసే ప్రతి అడుగు మజ్లిస్ మెప్పుకోసమేనని ఆరోపించారు.

టీఆర్‌‌ఎస్సోళ్లే కాంగ్రెస్‌‌ నుంచి పోటీ చేస్తరేమో!

మున్సిపల్‌‌ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని లక్ష్మణ్‌‌ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలతో పాటు సీఏఏను ప్రచార అస్త్రంగా చేసుకుంటామని చెప్పారు. బీజేపీ అంటేనే టీఆర్ఎస్ భయపడిపోతోందని, అందుకే తెలంగాణలో తమ పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టులు ఒక్కటవుతున్నారన్నారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా తర్వాత టీఆర్ఎస్‌‌లోనే చేరుతారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలే కారులో షికారు చేయగా మున్సిపోల్స్‌‌లో గెలిచిన కాంగ్రెస్ నేతలు గులాబీ కండువా కప్పుకోవడంలో ఆశ్చర్యమేముంటుంది’ అన్నారు. అవసరమైతే టీఆర్ఎస్ నాయకులనే  దొడ్డిదారిన కాంగ్రెస్ నుంచి పోటీకి దింపొచ్చన్నారు.

7న బీజేపీలోకి మోత్కుపల్లి

టీఆర్ఎస్, కాంగ్రెస్‌‌ల నుంచి రాజీనామాల ప్రక్రియ మొదలైందని, త్వరలోనే ఆ పార్టీల నుంచి బీజేపీలో చేరికలు ఉంటాయని లక్ష్మణ్‌‌ చెప్పారు. ఈ నెల 7న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఢిల్లీలో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారన్నారు.

BJP state president Laxman was furious over KTR's comments