కులగణన బూటకపు సర్వే : రాంచందర్రావు

కులగణన బూటకపు సర్వే : రాంచందర్రావు
  • రాష్ట్ర సర్కారు బీసీలను మోసం చేస్తున్నది: రాంచందర్​రావు
  • ఇప్పటికైనా సీఎం సొంత జిల్లాలోని సమస్యలను పరిష్కరించాలి
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీజేపీదే గెలుపని వెల్లడి

పాలమూరు, వెలుగు: కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఆ పార్టీ చేసిన కులగణన సర్వేలో రాష్ట్రంలో 56 శాతం బీసీలు ఉన్నారని చెప్పి.. కేవలం 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారని.. అందులో నుంచి 10% రిజర్వేషన్లు  ముస్లింలకు ఇచ్చి బీసీలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనంలో రాంచందర్​రావు పాల్గొని మాట్లాడారు.

 బీసీల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్​రెడ్డి.. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. మీరు చేసింది బూటకపు కులగణన. కర్నాటకలో చేసింది కూడా అదే”అని ఆయన​విమర్శించారు. సీఎం సొంత జిల్లా అయిన పాలమూరులో ఇప్పటికీ వలసలు చూస్తున్నామని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి జిల్లాలోని పెండింగ్​ప్రాజెక్టులను పూర్తిచేసి  రైతులకు సాగునీరు అందించాలని ఆయన కోరారు. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని రాంచందర్​రావు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల దగ్గరకు వెళ్లి.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని.. ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి కార్యకర్తలు మూడేండ్ల పాటు  కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కఠినంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 

ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నరు: ఎంపీ డీకే అరుణ

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో రైతులను మోసం చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ మోసాలపై ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని కార్యకర్తలకు ఎంపీ సూచించారు, రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలతోనే జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు.

 కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారి పాలమూరు జిల్లాకు వచ్చిన రాంచందర్​రావుకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మహబూబ్ నగర్ అప్పనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎంపీ డీకే అరుణతో కలిసి పూజలు చేశారు. సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పద్మజా రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, నాగురావు నామాజీ, కట్ట సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.