- అది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ మొదలుపెట్టిన ప్రక్రియ
- పశ్చిమబెంగాల్‌లో మాది చరిత్రాత్మక విజయం
- రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
తిమ్మాపూర్, వెలుగు : సర్ అనేది ఎలక్షన్ కమిషన్ మొదలుపెట్టిన చట్టబద్ధమైన ప్రక్రియని.. దాంతో కేంద్ర ప్రభుత్వానికి , బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో శనివారం నిర్వహించిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ‘సర్’ అంటే ఓటర్ లిస్ట్ ప్రక్షాళన మాత్రమేనని.. 2002లో జరిగిన ఈ కార్యక్రమం 2025లో కొన్ని రాష్ట్రాల్లో, 2026లో మరికొన్ని రాష్ట్రాల్లో జరుగుతోందన్నారు. కేరళలోనూ సర్ ప్రోగ్రామ్ జరిగిందని గుర్తుచేశారు. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఎలాంటి సమస్య లేదు.. కానీ బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంల మీద, సర్ కార్యక్రమం మీద అసత్యప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమిని ఒప్పుకోవాలే తప్ప చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
వడ్ల కొనుగోళ్లపై మంత్రులకే స్పష్టత లేదు
వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై మంత్రులకే అవగాహన లేదని రాంచందర్‌రావు విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రమే డబ్బులు ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనలేని స్థితిలో ఉందన్నారు. రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే ‘రైతు గోస బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుందని, ఇందుకు కేంద్రం కమీషన్ కూడా ఇస్తోందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వడ్ల కొనుగోళ్లను పట్టించుకోకుండా... ఎరువుల గురించి ముందే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు యూరియాను సక్రమంగా పంపిణీ చేయకుండా కేంద్ర ప్రభుత్నాన్ని బద్నాం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీమంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాడ వెంకట్‌రెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు కళ్లెం వాసుదేవరెడ్డి, ప్రశిక్షణ కమిటీ బాధ్యులు గుజ్జ శ్రీనివాస్, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, చింతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
