సర్కార్ నిర్లక్ష్యంతోనే స్టే..బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు వెళ్లాలి: రాంచందర్ రావు

సర్కార్ నిర్లక్ష్యంతోనే స్టే..బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు వెళ్లాలి: రాంచందర్ రావు
  •     హైకోర్టులో పిటిషన్లు వేసింది కాంగ్రెస్ వాళ్లేనని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై రాజకీయాలు చేయొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ‘‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడం.. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి  నిదర్శనం. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, న్యాయపరమైన తప్పులను సరిచేసుకోవాలి” అని సూచించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు.

 ‘‘ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ప్రభుత్వం గవర్నర్‌‌‌‌కు పంపింది. గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే.. ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం తొందరపడి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధం. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నది. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసి, బీసీ వర్గాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నది. 

వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మాపై దుష్ప్రచారం చేస్తున్నది” అని మండిపడ్డారు. బీజేపీ ముందు నుంచీ బీసీ రిజర్వేషన్లకు పూర్తిగా మద్దతు ఇస్తున్నదని తెలిపారు. ‘‘డిక్లరేషన్లు, బిల్లులు, ఆర్డినెన్స్ తెచ్చి.. ఇలా న్యాయపరంగా చెల్లుబాటు కాని విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలే లేదు. 

బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసినోళ్లు కాంగ్రెస్ పార్టీకి చెందినోళ్లే” అని ఆరోపించారు. సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సినీ నటుడు జేఎల్​శ్రీనివాస్, రిటైర్డ్ బ్యాంక్ అధికారి జీఎల్ కృష్ణారావు, భగవద్గీత ఫౌండేషన్ సీఈవో స్వాతి మీనన్... రాంచందర్​రావు సమక్షంలో బీజేపీలో చేరారు.