మునుగోడుపై ఎవరి గేమ్​ వాళ్లదే

మునుగోడుపై ఎవరి గేమ్​ వాళ్లదే
  • గండం దాటేందుకు కాంగ్రెస్​ ప్రయత్నాలు
  • ఉప ఎన్నికకు బ్రేక్​ వేసే ప్లాన్​
  • వరుసగా మూడో  బై ఎలక్షన్​పై గురి పెట్టిన బీజేపీ
  • రాజగోపాల్​ చేరితే నల్గొండ, ఖమ్మంలో పట్టు
  • మునుగోడులో గెలిస్తే తిరుగుండదని ఆలోచన
  • ఏ పరిస్థితికైనా రెడీ అంటున్న టీఆర్​ఎస్​
  • నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్​ ఫోకస్
  • బైపోల్​ వస్తే వ్యతిరేకత డైవర్ట్​ అవుతుందని ఎత్తుగడ

రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు సెంట్రిక్​గా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎవరి గేమ్​ను వాళ్లు ప్లే చేస్తున్నారు. మునుగోడు  ఉప ఎన్నిక వస్తేనే బెటర్​ అని, దీంతో తమ గేమ్  ప్లాన్​ సక్సెస్​ అవుతుందని బీజేపీ భావిస్తున్నది. ఉప ఎన్నిక వస్తే తమ సిట్టింగ్​ సీటు గల్లంతవటంతోపాటు పార్టీకి మరో దెబ్బ తగులుతుందని కాంగ్రెస్​ భయపడుతున్నది. బై ఎలక్షన్​ రాకుండా ఉండేందుకు ఆ పార్టీ  ప్రయత్నాలు చేస్తున్నది. సేఫ్​ గేమ్​ వైపు చూస్తున్నది. మునుగోడు ఉప ఎన్నిక వస్తే తమ పవర్​ మొత్తం ప్రయోగించాలని టీఆర్​ఎస్ తహతహలాడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరే గడువు ఉండటంతో.. ప్రభుత్వంపై జనానికి ఇప్పుడున్న వ్యతిరేకతను మళ్లించేందుకు డైవర్ట్ గేమ్​గా ఇది ఉపయోగపడుతుందని అంచనాలు వేసుకుంటున్నది. 

అన్నతో కాంగ్రెస్​ లీడర్ల రాయబారం
రాష్ట్ర కాంగ్రెస్​ సీనియర్​ లీడర్లు వరుసగా రెండో రోజు ఢిల్లీలోనే గడిపారు. రేవంత్​రెడ్డి, సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్కతో పాటు సీనియర్​ నేతలు గురువారం ఉదయాన్నే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలో కొనసాగేలా తమ్ముడ్ని ఒప్పించాలని వెంకట్​రెడ్డిని కోరారు. ఈ విషయంలో తాను తలదూర్చబోనని, ఇప్పటికిప్పుడు తాను చెప్పినా వినే పరిస్థితి లేదని వెంకట్​రెడ్డి దాదాపు చేతులెత్తేసినట్లు తెలిసింది. దీంతో అన్నతో నడిపిన రాయబారం ఫెయిలైనట్లేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

హైదరాబాద్, వెలుగు : బీజేపీ వైపు అడుగులేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని ఎలాగైనా సరే పార్టీ వీడకుండా ఒప్పించాలని కాంగ్రెస్​ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నది.  అవి ఫెయిలైతే..  మునుగోడుకు బై ఎలక్షన్​ రాకుండా కట్టడి చేసేందుకు అవసరమైన సేఫ్ ​గేమ్​ వెతుక్కుంటున్నది. రాజగోపాల్​రెడ్డి తనంతట తానుగా రిజైన్​ చేయకముందే.. పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనకు గండి కొట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. అప్పుడు ఆయన ఏ పార్టీలో చేరినా సరే.. ఎమ్మెల్యే పదవికి ఢోకా ఉండదని, దాంతో బై ఎలక్షన్​ అవసరమే లేకుండా పోతుందని విశ్లేషిస్తున్నారు. హుజూర్​నగర్, దుబ్బాక,  హుజూరాబాద్, నాగార్జునసాగర్​లో..  వరుసగా కాంగ్రెస్​కు ఎదురుదెబ్బలు తగిలాయి. మునుగోడులోనూ అదే రిపీటయ్యే ప్రమాదముందని పార్టీ లీడర్లు అప్రమత్తమయ్యారు. అందుకే  బై ఎలక్షన్​ రాకుంటేనే బెటర్​ అని, అట్లయితేనే పార్టీ లీడర్లు సేఫ్​గా ఉంటారని బహిరంగంగానే చర్చిస్తున్నారు. లేకుంటే  సిట్టింగ్​ సీటు పోవటంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏఐసీసీ నుంచి రాజగోపాల్​కు పిలుపు!
పార్టీకి డ్యామేజీ జరగకముందే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి చేసిన ప్రతిపాదనను ఏఐసీసీ పెద్దలు సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఒక్కరొక్కరుగా ముఖ్య నేతలను దూరం చేసుకుంటే ప్రమాదమని, పార్టీ వదలకుండా కాపాడుకోవాలని హైకమాండ్​ సూచించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న రాజగోపాల్​రెడ్డితో మాట్లాడటంతో పాటు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలను ఏఐసీసీ వర్గాలు సీనియర్​​ నేత దిగ్విజయ్​సింగ్​కు అప్పగించాయి. రంగంలోకి దిగిన  దిగ్విజయ్​సింగ్.. రాజగోపాల్​రెడ్డికి ఫోన్​ చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ పిలుపుగా రాజగోపాల్​ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినట్లు సమాచారం. ఒకటీ రెండు రోజుల్లోనే వీరిద్దరి భేటీ జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి.  

పట్టు సాధించే పనిలో బీజేపీ 
మునుగోడు బై ఎలక్షన్​ వచ్చే పరిస్థితి క్రియేట్​ చేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నది. రాజగోపాల్​రెడ్డిని పార్టీలో చేర్చుకోవటం ద్వారా మల్టిపుల్​​ బెనిఫిట్స్​ ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టున్న సీనియర్ లీడర్ కమల దళంలో చేరటంతో బై ఎలక్షన్​ సునాయాసంగా గెలిచే చాన్స్​ ఉంటుందని భావిస్తున్నది. ఫలితంగా తమ ఎమ్మెల్యేల బలం పెరుగుతుందని ఆశిస్తున్నది. వరుసగా దుబ్బాక, హుజూరాబాద్​లో గెలుపుతో బీజేపీ ట్రెండ్​ తెలంగాణలో కొనసాగుతున్నది. మునుగోడు బై ఎలక్షన్​ కూడా తమ ఖాతాలో పడితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీకి తిరుగుండదని బీజేపీ జాతీయ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నది. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్​, రంగారెడ్డిలో పార్టీకి పట్టుందని, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి చేరితే దక్షిణ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మంలోనూ పార్టీ బలపడుతుందని బీజేపీ భావిస్తున్నది. అందుకే కాంగ్రెస్​ ముందస్తుగా సస్పెండ్​​ చేసినా, రాజగోపాల్​రెడ్డితో ఎమ్మెల్యే సభ్యత్వానికి రిజైన్​ చేయించి.. బై ఎలక్షన్​కే మొగ్గు చూపాలని ప్లాన్​ చేసుకుంటున్నది. 

డైవర్షన్​కు తోడ్పడుతుందని టీఆర్​ఎస్​ ప్లాన్​
మునుగోడుకు ఉప ఎన్నిక రాకుంటే సరే సరి అని టీఆర్​ఎస్​ భావిస్తున్నది! ఒక వేళ వస్తే మాత్రం తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్లాన్​ చేసుకుంటున్నది. దుబ్బాక,  హుజూరాబాద్​లో జరిగిన డ్యామేజీని చెరిపేసేందుకు మునుగోడులో తమ అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించాలని అనుకుంటున్నది. వచ్చే ఏడాది డిసెంబర్​తో టీఆర్​ఎస్​ పదవీ కాలం ముగుస్తుంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఎంచుకున్న పథకాలు, కార్యకలాపాలన్నీ  బెడిసికొడుతున్నాయి. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు, జనం దృష్టిని మళ్లించేందుకు బై ఎలక్షన్  ఉపయోగపడుతుందని టీఆర్​ఎస్​ లీడర్లు భావిస్తున్నారు. నయానో భయానో అక్కడ గెలిచి తీరితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల భయం కూడా తమను వదిలిపోతుందనే ధీమా వారిలో వ్యక్తమవుతున్నది.