2023 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ బైక్ ర్యాలీలు

2023 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ బైక్ ర్యాలీలు

2023 ఎన్నికలే టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే గ్రామీణా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టి పెట్టింది. ఇవాళ్టి నుంచి బీజేపీ భరోసా యాత్ర నిర్వహించనుంది. భరోసా యాత్రపేరుతో నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జిల్లాల్లో బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 14 వరకు నేతలు.. ప్రజా గోస–బీజేపీ భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే కొన్ని రూరల్ ప్రాంతాల్లో భరోసా యాత్రలో చేపట్టిన బీజేపీ ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 రోజుల పాటు 2 వందల బైక్ లతో ర్యాలీలు చేసేలా నేతలు ప్లాన్ చేశారు.

యాత్రలో భాగంగా బీజేపీ నేతలు గ్రామాల్లోని సమస్యలపై ప్రజలను కలువనున్నారు. ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్ లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నారు. మరోవైపు 28న నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం బైంసా నుంచి..  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. డిసెంబర్ 17న కరీంనగర్ నియోజకవర్గంలోని SRR కళాశాల దగ్గర పాదయాత్ర ముగియనుంది. అక్కడే ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సంజయ్ మాట్లాడనున్నారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర పోస్టర్ ను పార్టీ స్టేట్ ఆఫీస్ లో బీజేపీ నేతలు ఇప్పటికే విడుదల చేశారు. 20 రోజులు.. 222 కిలోమీటర్లు ఐదో విడత పాదయాత్ర జరుగుతుందన్నారు.