రావణుడి అవతారం.. నవయుగ రావణ్.. రాహుల్ గాంధీ : బీజేపీ వైరల్ పోస్ట్

రావణుడి అవతారం.. నవయుగ రావణ్.. రాహుల్ గాంధీ : బీజేపీ వైరల్ పోస్ట్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ మరోసారి ఎదురుదాడికి పాల్పడింది. భారతదేశాన్ని నాశనం చేయడమే అతని లక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. రాహుల్ గాంధీని నవయుగ 'రావణ్'గా చిత్రీకరించి ఈ పోస్టును రిలీజ్ చేసింది.

ఈ పోస్టును Xలో షేర్ చేసిన బీజేపీ.. రాహుల్ గాంధీ పోస్టర్‌ను పంచుకుంది. ఇందులో పార్టీ అతన్ని కొత్త యుగం 'రావణ్'గా చిత్రీకరించింది. "నవయుగ రావణుడు ఇక్కడ ఉన్నాడు. అతను దుర్మార్గుడు. ధర్మ వ్యతిరేకుడు. రామునికి వ్యతిరేకి. భారత్‌ను నాశనం చేయడమే అతని లక్ష్యం" అంటూ క్యాప్షన్ లో జోడించింది. బీజేపీ షేర్ చేసిన ఈ పోస్టర్‌లో ‘రావణ్.. కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్.. జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించారు’ అని కూడా రాశారు.

జార్జ్ సోరోస్ ఒక హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. అతనిపే దేశాన్ని అస్థిరపరిచేందుకు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. అతను అనేక భారతదేశ వ్యతిరేక ప్రచారాలను నడుపుతున్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో రాహుల్‌ గాంధీ తన అమెరికా పర్యటనలో హంగేరియన్‌-అమెరికన్‌ వ్యాపారి నిధులు సమకూర్చుకున్న వ్యక్తులను కలిశారని బీజేపీ ఆరోపించింది. జార్జ్ సోరోస్‌తో అనుబంధం ఉన్న సునీతా విశ్వనాథ్‌ను రాహుల్ అమెరికా పర్యటనలో కలిశారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కాషాయ పార్టీ కాంగ్రెస్‌ను కోరింది.